మహబూబాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ పార్టీ శక్తి ముందు బీజేపీ ఎంత? అని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకులు మాటల తూటాలు పేల్చి.. గొడవలు సృష్టించి రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. గురువారం మహబూబాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్‌లతో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల పేరిట దేశవ్యాప్తంగా ఉన్న ఆ పార్టీ నాయకులు తెలంగాణకు వస్తున్నారన్నారు. సదరు నాయకులను రాష్ట్రవ్యాప్తంగా మోహరించి టీఆర్ఎస్ పార్టీతోపాటు నాయకులను తిట్టే కార్యక్రమాలు పెట్టుకోవడం బీజేపీ నాయకుల దివాలాకోరుతనానికి నిదర్శనమన్నారు.
టీఆర్ఎస్ శక్తి ముందు ఏ శక్తీ పనిచేయదనే విషయాన్ని బీజేపీ నాయకులు గుర్తించాలని చెప్పారు. ముందుగా విభజన హామీలు నెరవేర్చిన తరువాతే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు రాష్ట్రంలో అడుగుపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. బీజేపీపాలిత రాష్ర్టాల్లో తెలంగాణలో ఉన్న సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయా? అని ప్రశ్నించారు. 8 రాష్ర్టాల్లో బీజేపీకి బలం లేకపోయినా గొడవలు సృష్టించి ఇతర పార్టీలను కలుపుకొని దుర్మార్గంగా గద్దెనెక్కడం కాదని, దమ్ముంటే ప్రజాబలంతో గెలవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ కుట్రలు, కుతంత్రాలకు తెరలేపిందన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ వంద నియోజకర్గాల్లో మూడో స్థానానికే పరిమితమై డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు.