హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): త్వరలో కిశోర బాలికలకు పౌష్టికాహార కిట్లను అందజేయనున్నామని స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు. రాష్ట్ర బాలల హకుల కమిషన్, స్త్రీ, శిశు సంక్షేమశాఖ సహకారంతో ప్లాన్ ఇండియా సాంకేతిక సహాయంతో రాష్ట్రంలో గ్రామ బాలల పరిరక్షణ కమిటీ (వీసీపీసీ) కోసం రూపొందించిన కరదీపికను సోమవారం స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనరేట్ కార్యాలయంలో ఆమె ఆవిష్కరించారు. అనంతరం ఆమె అన్ని జిల్లాల సంక్షేమ అధికారులు, సీడబ్ల్యూసీలు, డీసీసీ యూనిట్లు, బాల రక్ష భవన్ అధికారులు, ప్లాన్ ఇండియా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం రాజీపడబోదని స్పష్టంచేశారు.
బాలల హక్కుల రక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంతో రాష్ట్రంలో బాల్య వివాహాలు తగ్గాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అర్హులైన కిశోర బాలికలకు సంపూర్ణ పౌష్టికాహార కిట్ల కోసం బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించామని, ఈ కిట్ల పంపిణీని త్వరలోనే ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడైనా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారనే విషయం తెలిస్తే ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు.
తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో రూపొందించిన వీసీపీసీ కరదీపిక రాష్ట్రంలోని 12,769 గ్రామాల్లో బాలల పరిరక్షణ, అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్ అధ్యక్షుడిగా ఉండే వీసీపీసీ నిర్దిష్ట తేదీల్లో సమావేశాలు నిర్వహించి, పిల్లల సమస్యలు కమిటీ దృష్టికి వచ్చా యా లేదా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించి అక్కడికక్కడే చర్యలు తీసుకోవాలని సూచించారు. బాలల పరిరక్షణ కమిటీ చర్యలు, హకులు ప్రతి ఒకరికీ తెలిసేలా ప్రతి గ్రామంలో ప్రధాన కూడళ్లలో, సూల్స్, గ్రామపంచాయతీలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ జోగినపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పిల్లల రక్షణ విషయంలో తెలంగాణ దేశంలో నే ముందువరుసలో ఉన్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన వీసీపీసీలు దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు అపర్ణ, రాగజ్యోతి, శోభారాణి, అంజన్రావు, బృందాదరరావు, దేవయ్య, ప్లాన్ ఇండియా సంస్థ డైరెక్టర్ అనుశ్రీ, మిశ్రా, శాలిని ప్రభాత తదితరులు పాల్గొన్నారు.