ములుగు/హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తేతెలంగాణ): ములుగు జిల్లా మంగపేట మండలంలోని శనిగకుంట అగ్నిప్రమాద బాధితులకు సర్కారు అండగా నిలిచింది. అగ్నిప్రమాదంలో 24 గుడిసెలు దగ్ధమై నిరాశ్రయులైన 40 కుటుంబాలను అన్నివిధాలా ఆదుకొంటామని భరోసా ఇచ్చింది. గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శుక్రవారం అధికారులను ఈ మేరకు ఆదేశించారు. ములుగు జిల్లా అధికారులతో ఆమె మాట్లాడి, సహాయక చర్యలను సమీక్షించారు.
40 కుటుంబాలకు తమ శాఖ నుంచి రూ.25 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నామని ప్రకటించారు. అలాగే రెవెన్యూ శాఖ నుంచి ఒక్కో కుటుంబానికి రూ.15 వేలు చెల్లిస్తామని చెప్పారు. తక్షణ సాయం కింద కుటుంబానికి 25 కిలోల బియ్యం, రూ.1,800 విలువైన 12 రకాల వంట సామగ్రి కిట్ అందించాలని అధికారులను ఆదేశించారు. గుడిసెలు పూర్తిగా కాలిపోవడంతో వారు కుదుటపడే వరకు ప్రభుత్వమే పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి, అన్ని వసతులు కల్పిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి ఆదేశాల మేరకు కలెక్టర్ ఎస్ కృష్ణఆదిత్య, ఏటూరునాగారం ఏఎస్పీ అశోక్‌కుమార్ శుక్రవారం ఉదయం ఘటనా స్థలానికి వెళ్లి, బాధితులను ఓదార్చారు. ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చి, పునరావాస కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. సర్టిఫికెట్లు కాలిపోయిన యువతీయువకులకు బోర్డు అధికారులతో మాట్లాడి డూప్లికేట్ సర్టిఫికెట్లు అందేవిధంగా చర్యలు తీసుకొంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు.