మహబూబాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే వరకు చెప్పులు వేసుకోనని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చేపట్టిన దీక్ష నేటితో ఏడాది పూర్తయింది. మారుమూల ప్రాంతా లు, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు కాలిబాట కూడా సరిగా లేని తండాలకు వెళ్లినా, వాగులు, వంకలు, రాళ్లు, రప్పలు దాటాల్సి వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదురైనా చెప్పు లు మాత్రం వేసుకోవడం లేదు. కాళ్లకు బొబ్బలు కట్టినా.. ముళ్లు, రాళ్లు తగిలి గాయపడిన పరిస్థితుల్లోనూ.. పకనున్న వాళ్లంతా చెప్పులు వేసుకోండి మేడమ్ అంటున్నా.. చిరునవ్వుతో నడుస్తున్నారే తప్ప ఏడాది కాలంగా పాదరక్షలు వాడటం లేదు. సీఎం కేసీఆర్ గిరిజన భవన్, ఆదివాసీ భవన్లను ఏడాది క్రితం హైదరాబాద్లో ఇదే రోజు ప్రారంభించారు. అదే సభలో గిరిజనుల రిజర్వేషన్ శాతా న్ని పది శాతానికి పెంచుతూ ప్రకటన చేయడంతో ఆనందంతో తబ్బిబ్బయిన మంత్రి సత్యవతి రాథో డ్ వేదికపైనే సీఎం కేసీఆర్ పాదాలకు నమస్కరించారు. గిరిజనులకు ఇంత గొప్పవరమిచ్చిన కేసీఆర్ మూడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టే వరకు పాదరక్షలు ధరించనని ప్రకటించి చెప్పులు వదిలేశారు. ఏడాదైనా పట్టిన దీక్ష మేరకు పాదరక్షలు ధరించడంలేదు. అంతేగాక తండ్రిగా ఆదరించి మంత్రిగా అవకాశం కల్పించిన మహానుభావుడు కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటానంటూ చేతిపై కేసీఆర్ పేరుతో పచ్చబొట్టు వేయించుకున్నారు.