హైదరాబాద్ : భారతదేశ తొలి ప్రధాన మంత్రి, పిల్లలకు ఇష్టమైన చాచా నెహ్రూ పుట్టిన రోజును బాలల దినోత్సవంగా నేడు జరుపుకుంటున్న సందర్భంగా పిల్లలందరికీ రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
నేటి బాలలే రేపటి పౌరులు అన్న మాటను ఆచరణలో అమలు చేస్తూ ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బాలల బంగారు భవిష్యత్ కోసం బాటలు వేస్తున్నామన్నారు. శిశువు గర్భంలో పడినప్పటి నుంచి పెరిగి పెద్దయ్యే వరకు ప్రతి దశలో తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలబడుతూ వారి సమగ్ర వికాసానికి కృషి చేస్తోందన్నారు.
బాల్యం ఒక అమూల్యమైన అనుభవం అని, బాలలు పరిమళించే గులాబీలు అని వారి భవితవ్యాన్ని, హక్కులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహిళా, శిశు సంక్షేమ శాఖ ద్వారా బాలల హక్కుల పరిరక్షణ కమిటీలు, బాలల కేంద్రాలు, శిశు సదనాలు నిర్వహిస్తోందన్నారు. ప్రజలంతా కూడా బాలల హక్కులను కాపాడడంలో ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.