హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను దేశవ్యాప్తంగా అమలు చేస్తారా..? అంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సూటి ప్రశ్న సంధించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో విడుదల చేసిన డిక్లరేషన్‌ను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎస్సీ, ఎస్టీల వెనుకబాటుకు కాంగ్రెస్సే కారణమని చెప్పారు. ఆదివారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎంపీ మాలోతు కవిత, ప్రభుత్వ విప్ ఎమ్మెస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ టీ రవీందర్రావులతో కలిసి సత్యవతి మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కుట్రపూరిత ఆలోచనలను తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. గతంలో ఎస్టీ రిజర్వేషన్ 4 నుంచి 6 శాతానికి ఎన్టీఆర్ పెంచారని, ఆ తర్వాత సీఎం కేసీఆర్ 10 శాతానికి పెంచారని గుర్తు చేశారు. గూడేలు, తండాలను గ్రామపంచాయతీలుగా చేసింది కేసీఆరేనని, ఒకేసారి 4 లక్షల ఎకరాలకుపైగా పోడు భూముల పట్టాల పంపిణీ చేశారని గుర్తు చేశారు. 75 ఏండ్లలో సేవాలాల్ జయంతి వేడుకలు నిర్వహించాలన్న ఆలోచన ఏనాడైనా కాంగ్రెస్‌కు వచ్చిందా..? అంటూ ప్రశ్నించారు. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలనే డిక్లరేషన్‌లో ప్రస్తావించారు తప్ప కొత్తవి ఏమీ లేవన్నారు.
ఎస్సీల వర్గీకరణకు బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందని, ఇప్పటికే దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపించామని తెలిపారు. ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే కాంగ్రెస్ పార్లమెంట్లో ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎస్సీలకు కనీసం లక్ష రూపాయలైనా ఇస్తున్నారా..? అని నిలదీశారు. ఎన్నికల వేళ వచ్చే మాయల ఫకీర్లను చైతన్యంతో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మాయమాటలు చెబుతున్న కాంగ్రెస్, బీజేపీలను డిపాజిట్ కూడా రాకుండా ఓడించాలని కోరారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే విధానం రేవంత్‌దని సత్యవతి అన్నారు. కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ డమ్మీ అని ప్రభుత్వ విప్ ఎమ్మెస్ ప్రభాకర్ కొట్టిపారేశారు. ఎంపీ కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ డిక్లరేషన్ చెత్త కుండీలో వేయడానికే పనికి వస్తుందని ఎద్దేవా చేశారు. ఓట్ల కోసం ఇలాంటి డిక్లరేషన్లు చేసి అభాసు పాలు కావద్దని కాంగ్రెస్‌కు హితవు పలికారు. కాంగ్రెస్ తన చేతకానితనాన్ని బయటపెట్టుకుందని ఎమ్మెల్సీ రవీందర్రావు విమర్శించారు.