హైదరాబాద్ : వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొంటూ బాలికలు అన్నిరంగాల్లో రాణించాలని మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. నగరంలోని వెంగళ్రావునగర్లోని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కార్యాలయంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. శిశు విహార్‌లో డైనింగ్ హాల్‌తో పాటు ఐసీడీసీ ఖైరతాబాద్ ప్రాజెక్ట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఆడపిల్లలకు శుభాకాంక్షలు తెలిపారు. బాలికలు ‘ఇది మా సమయం.. మా హక్కులు.. మా భవిష్యత్తు’ అనే నినాదంతో ముందుకు సాగేలా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.
గతంలో ఆడపిల్లలు అంటే కడుపులోనే తుంచే వారని.. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవరన్నారు. సీఎం కేసీఆర్ ఆడపిల్లలు సగర్వంగా తలెత్తుకునేలా చేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆడపిల్లలకు అన్నివిధాలా అండగా నిలిచిందన్నారు. పథకాలు అమలు చేయడంతో పాటు మహిళల భద్రతకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా భరోసా, షీ టీమ్స్, సఖీ కేంద్రాలు బాలికలు, మహిళల భద్రతకు ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో ఆడపిల్ల పుడితే అయ్యే అనుకునే పరిస్థితులు పోయి.. మహాలక్ష్మిగా భావించే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. సీఎం కేసీఆర్, ప్రభుత్వం ఆడపిల్లలకు అండగా ఉందన్నారు.