మహబూబాబాద్, ఆగస్టు 27: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేసినా, మోకాళ్ల యాత్ర చేసినా, దొర్లుకుంటూ యాత్ర చేసినా ప్రజలు నమ్మబోరని గిరిజన, స్త్రీ సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఎద్దేవా చేశారు. శనివారం ఆమె మహబూబాబాద్ టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, జడ్పీ చైర్పర్సన్ బిందుతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బండి యాత్ర ప్రజాసంగ్రామ యాత్ర కాదని, రౌడీల యాత్ర అని మండిపడ్డారు. హిందువులు, ముస్లింలు సమన్వయంతో నడిచిన ఈ దేశంలో బీజేపీ మత చిచ్చును రాజేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ సభలో మాట్లాడిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై, బీజేపీ నాయకులపై ఆమె విరుచుకుపడ్డారు. విభజన హామీలైన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్, గిరిజన యూనివర్శిటీ ఎక్కడని నిలదీశారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ మునుగుడేనని ఎద్దేవా చేశారు. ఢిల్లీలోని ఆప్ నాయకులను బ్లాక్మెయిల్ చేసి రూ.25 కోట్లకు ఒక్కో ఎమ్మెల్యేను కొనాలని చూస్తున్నది బీజేపీ కాదా? అని నిలదీశారు. బీజేపీకి నాలుగో ఆర్.. రాజగోపాల్‌రెడ్డి అని ఆ పార్టీ నేతలు భ్రమ పడుతున్నారని, ఎన్ని ఆర్లు వచ్చినా, కేసీఆర్‌ను ఏం చేయలేరని స్పష్టం చేశారు.