హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): గిరిజన సంక్షేమశాఖ, మహిళా అభివృద్ధి శిశుసంక్షేమశాఖల్లో పదేండ్ల ప్రగతిని చాటుతూ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావరణంలో అంగరంగ వైభవంగా నిర్వహించాలని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు జూన్ 2 నుంచి 22 వరకు ఏరోజున ఏ కార్యక్రమం చేపట్టాలో అధికారులకు మంత్రి వివరించారు. శనివారం సచివాలయంలో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో వాటి నిర్వహణపై అంశాల వారీగా చర్చించారు. గిరిజనుల సాంసృతిక ఉత్సవాలు, ఆర్ట్ఫామ్స్ ప్రదర్శన, గిరిజనుల ఉత్పత్తులపై వర్షాప్లు నిర్వహించాలని చెప్పారు.
పోడు’ పంపిణీకి ఏర్పాట్లు చేయండి
జూన్ 24 నుంచి 30 దాకా రాష్ట్రంలోని 2,845 గ్రామాలు, తాండాలు, గూడేల పరిధిలో ఆదివాసీ గిరిజనుల అధీనంలోని 4,01,405 ఎకరాల పోడు భూములకు పట్టాలు అందచేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి రాథోడ్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ కార్యదర్శి స్మితా సబర్వాల్, రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి భారతి హోళికెరి తదితరులు పాల్గొన్నారు.