మహబూబాబాద్ : రాష్ట్రంలో గత ఏడేండ్లలో గురుకుల విద్య అభివృద్ధికి కోట్లాది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసి విద్యాభివృద్ధికి పాటుపడుతుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్వచ్ఛ గురుకులం’ కార్యక్రమాన్ని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర రెసిడెన్షియల్ పాఠశాల, సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలల్లో జిల్లా కలెక్టర్ కె. శశాంకతో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో గురుకులాల సంఖ్యను 183 కు పెంచుకున్నామని, 22 డిగ్రీ కాలేజీలు 332 ఆశ్రమ పాఠశాలలు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ నెల 5 నుంచి 11 వ తేదీ వరకు నిర్వహించే స్వచ్ఛ గురుకులం వారోత్సవాలలో విద్యార్థులు తమ విద్యాలయాల్లో పరిసరాల పరిశుభ్రతను పాటించాలన్నారు.
దీనిలో భాగంగా తమ విద్యాలయాలలో ఏడు రోజుల పాటు నిర్వహించే స్వచ్ఛ గురుకులం కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో చేపలన్నారు. గురుకులాల సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేస్తామని, దీనిలో భాగంగా మహబూబాబాద్ గురుకులానికి కోటి రూపాయలు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు.
విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశాలు నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అదేవిధంగా విద్యార్థుల ఆహార విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని విద్యా సంస్థలలో మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయాలని మంత్రి ఆదేశించారు.
కార్యక్రమంలో బానోత్ శంకర్ నాయక్, జెడ్పీ చైర్పర్సన్ కుమారి అంగోత్ బిందు, శిక్షణ కలెక్టర్ పరమర్ పింకేశ్వర్ కుమార్, లలిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.