మహబూబాబాద్ : భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన వీఆర్ఏలను ముఖ్యమంత్రి కేసీఆర్ పేస్కేల్ ఉద్యోగులుగా మార్చారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న16,758 మంది వీఆర్ఏల ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తూ తెలంగాణ సర్కారు జీవో నంబర్ 81ను జారీ చేసింది.
ఈ సందర్భంగా జిల్లాలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో వీఆర్ఏలకు ఉద్యోగ నియామక పత్రాలను మంత్రి అందజేసి మాట్లాడారు. సామాన్యుల కష్టం తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. ఒక్క సంతకంతో ఈ రోజు వేలది వీఆర్ఏల ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారని ప్రశంసించారు. సమైక్య పాలనలో వీఆర్ఏలను తలారులుగానే పిలిచారు తప్ప, వారి కష్టాలకు తగిన గుర్తింపు ఇవ్వలేదు.
కనీసం గౌరవ వేతనం ఇవ్వాలని ఎంత ప్రాధేయపడ్డా కనికరం చూపలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బానోత్ శకర్ నాయక్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు, జిల్లా కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ డేవిడ్, జడ్పీ సీఈవో రమాదేవి, పంచాయతీ శాఖ అధికారి నర్మద, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి పాల్గొన్నారు.