వికారాబాద్ : వికారాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ఈ నెల 16వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయాన్ని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, కాలేరు యాదయ్య, పట్నం నరేందర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, కలెక్టర్ నిఖిల, ఎస్పీ కోటి రెడ్డి, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ కూడా కార్యాలయాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు.
ఈ సందర్భంగా అధికారులతో సమావేశం నిర్వహించారు. సభాస్థలి, పార్కింగ్, ఇతర ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం బహిరంగ సభ స్థలం, వేదికలను పరిశీలించి మంత్రి పలు సూచనలు చేశారు. నియోజకవర్గాల వారీగా వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. మినిట్ టూ మినిట్ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని పేర్కొన్నారు. ఒక్కో విభాగానికి జిల్లా స్థాయి అధికారులను నియమించి నిశితంగా పరిశీలించాలని, ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూడాలన్నారు. అధికారులు మొత్తం కార్యక్రమానికి సంబందించిన వివరాలను మ్యాపుల ద్వారా మంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి పర్యటనకు మరో మూడు రోజులు మిగిలి ఉండటంతో మిగిలిన పనులను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.