బడంగ్‌పేట, ఏప్రిల్ 19: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని కాలనీల్లో చుక్క వరద నీరు ఆగకుండా ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి వ్యూహాత్మక నాలాల అభివృద్ధి పథకం (ఎస్ఎన్డీపీ) పనులను వర్షాకాలంలోపే పూర్తి చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. వరద నీరు ఆగకుండా ఉండటంతోపాటు మీర్‌పేట పరిధిలోని చందన చెరువు, మంత్రాల చెరువు, పెద్ద చెరువుల్లోకి మురుగు నీరు వెళ్లకుండా ట్రంక్‌లైన్ పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయని తెలిపారు. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌తో కలిసి మంత్రి సబిత బుధవారం మూడు చెరువులను పరిశీలించారు.
చెరువుల చుట్టూ తిరిగి ఇప్పటివరకు జరిగిన పనుల తీరును గమనించారు. ఇంకా చేయాల్సిన పనుల వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చెరువులను అభివృద్ధికి నిధులు కావాలని అడిగిన వెంటనే పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ స్పందించి రూ.95 కోట్ల నిధులు ఇచ్చారని చెప్పారు. ఆ పనులు చివరి దశలో ఉన్నాయని, ఇంకా అవసరమైతే రెండో దశ కింద మరో రూ.95 కోట్లు ఇచ్చేందుకు కూడా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సానుకూలంగా ఉన్నారని తెలిపారు. ఈ పనులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్నామేగానీ మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో చేపట్టలేదని స్పష్టంచేశారు.
పనులు చేసిన వారిని గుర్తుంచుకోండి
పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని మంత్రి సబిత కోరారు. పనులు చేయకుండానే రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించే బీజేపీ వారిని ఒక కంట కనిపెట్టాలని సూచించారు. సరైన సమయంలో అలాంటి వారికి గుణపాఠం చెప్పాలని కోరారు. కాలనీలకు వస్తున్న బీజేపీ నాయకులను గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రజలు నిలదీయాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కమిషనర్ నాగేశ్, డీఈ గోపీనాథ్, హెచ్ఎండీఏ అధికారులు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.