Minister Sabitha Indra Reddy | వరంగల్ సభలో ప్రధాని మోదీ తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై చేసిన విమర్శలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోదీ అసత్యాలు ప్రచారం చేయడానికి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్లు ఉన్నారని ఆరోపించారు. యూనివర్సిటీల ఉమ్మడి రిక్రూట్మెంట్ బిల్లు ఎక్కడ ఆగిందో తెలియదా..? అని ప్రశ్నించారు. ఆపింది మీరే.. తిరిగి మాట్లాడుతుంది మీరేనా..? ప్రజలు మెచ్చే పాలన చేస్తూ.. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ పై విమర్శలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోదీకి తెలంగాణ అంటే ద్వేషమేనని, తెలంగాణ ఓ రాష్టంగా పరిపాలన చేస్తూ దేశానికే ఒక బాట చూపుతుంటే కండ్లు మండుతున్నాయన్నారు. పార్లమెంట్ సాక్షిగా తల్లిని చంపి బిడ్డను వేరు చేశారన్న ప్రధాని వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరిచిపోరన్నారు. ప్రజలు కోరిందొకటి.. ఇచ్చింది మరొకటన్నారు. విభజన హామీలు మరిచిపోయి.. విష ప్రచారం చేస్తున్నారని, విలువైన ప్రాజెక్టులు గుజరాత్‌కు.. మామూలివి తెలంగాణకు ఇస్తారా? అంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్‌పై ప్రధాని ఎంత ద్వేషం ప్రదర్శిస్తే.. తెలంగాణ ప్రజలు అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తారు.. అభిమానిస్తారన్నారు. కాజీపేటకు రిపేర్ ఫ్యాక్టరీ ఇచ్చి.. గుజరాత్‌లోని దహోడ్‌లో రూ.20వేల కోట్లతో లోకోమోటివ్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారన్నారు.
మోదీ దేశానికి ప్రధానా? గుజరాత్‌కా? అంటూ ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు కర్మాగారం నేటికి రాలేదని, రంగారెడ్డి జిల్లాకు గతంలో మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ పథకాలను దేశం స్వాగతిస్తుంటే.. మోదీకి భయంపట్టుకుందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కొత్తగా తెలంగాణకు రాష్ట్రానికి ఒక్క విద్యాలయం ఇవ్వలేదని, ఐఐఎంలు దేశంలో ఏడు మంజూరు చేస్తే అందులో తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదన్నారు. ఐఐఎస్ఈఆర్లు రెండు మంజూరు చేస్తే తెలంగాణ ఒక్కటి ఇవ్వలేదని, ఐఐఐటీలో 16 ఏర్పాటు చేస్తే.. తెలంగాణకు రిక్తహస్తం చూపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.