హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): విద్యార్థి దశలోనే వినూత్నంగా ఆలోచించడం మొదలుపెట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. మేధో సంపత్తి హక్కుల దినోత్సవం సందర్భంగా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అవేర్నెస్ సొసైటీ ఆధ్వర్యంలో ‘ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ ఇన్నోవేషన్స్ ఫర్ స్కూల్స్ అండ్ సొసైటీ’ అనే హ్యాండ్‌బుక్‌ను రూపొందించారు.
మంగళవారం ఈ పుస్తకాన్ని హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఆవిష్కరించిన మంత్రి సబిత మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే విద్యార్థులను ఆవిష్కరణల వైపు నడిపించాలని చెప్పారు. 190 దేశాల్లో నిర్వహిస్తున్న మేధో సంపత్తి హక్కుల దినోత్సవంపై మరింత అవగాహన అవసరమని తెలిపారు. ప్రతిఒక్కరికీ అర్థమయ్యేంత సులభంగా పుస్తకాన్ని రూపొందించిన ఐపీఆర్ఏఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు సుభజిత్ సాహాను మంత్రి అభినందించారు. ఇంగ్లిష్, తెలుగు రెండు భాషల్లో తీసుకొచ్చిన ఈ హ్యాండ్‌బుక్‌ను ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంచినట్టు సుభజిత్ సాహా తెలిపారు.