PRLIS | హైదరాబాద్, మార్చి28 (నమస్తే తెలంగాణ): కోర్టులో న్యాయ విచారణ కొనసాగుతున్నందున పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వలేమని, ఈ నేపథ్యంలోనే డీపీఆర్‌ను వెనక్కి పంపామని కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌భూషణ్ దరి వెల్లడించారు. ఈ మేరకు పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. పీఆర్ఎల్ఐఎస్ను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఏదైనా ప్రతిపాదన పంపిందా? ఒకవేళ పంపితే దానికి సంబంధించిన వివరాలేమిటి? ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తీసుకున్న చర్యలు ఏమిటి? అని ఎంపీ ప్రశ్నించారు.
దీనికి కేంద్ర మంత్రి స్పందిస్తూ, జాతీయహోదా కావాలని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే డిమాండ్ చేసిందని వెల్లడించారు. ప్రాజెక్టు డీపీఆర్‌ను కూడా అనుమతుల కోసం కేంద్ర జల కమిషన్ (సీడబ్ల్యూసీ)కి పంపించిందని గుర్తుచేశారు. అయితే, ప్రాజెక్టుకు కేటాయించిన కృష్ణా జలాలపై ట్రిబ్యునల్‌లో విచారణ కొనసాగుతున్నదని, ఈ నేపథ్యంలో ప్రాజెక్టు టెక్నో ఎకనామిక్ రిపోర్ట్‌ని పరిగణనలోకి తీసుకోవడం సాధ్యం కాదని వెల్లడించారు. అందుకే అనుమతులివ్వకుండా డీపీఆర్‌ను గత డిసెంబర్లోనే తిప్పిపంపినట్టు వెల్లడించారు.