హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రైవేటు దవాఖానాల్లో ‘ఆరోగ్యశ్రీ’ సేవలను కొనసాగించాలని నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్లను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కోరారు. బుధవారం అమీర్‌పేట్‌లోని సీహెచ్‌సీలో ‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్’ అభియాన్ కార్యక్రమాన్ని ఆయన కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లతో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. తొమ్మిదిన్నరేండ్లు చేయని సమ్మె ఇప్పుడెందుకు చేస్తున్నారని అసోసియేషన్‌ను ప్రశ్నించారు. వైద్యసేవలు అం దించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.
100% సమ్మెలోనే! ; ‘ఆరోగ్యశ్రీ’పై సర్కారు లెక్కలు తప్పు ఐక్యత దెబ్బతీసేందుకు కుట్ర రాకేశ్
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ‘ఆరోగ్యశ్రీ’ నెట్వర్క్ ఆసుపత్రులు 100శాతం సమ్మెలో పాల్గొన్నట్టు నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వద్దిరాజు రాకేశ్ పేర్కొన్నారు. నెట్వర్క్ దవాఖానల ఐక్యతను దెబ్బ తీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ‘నమస్తే తెలంగాణ’తో బుధవారం ఆ యన మాట్లాడుతూ.. సాయంత్రం 7 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నెట్వర్క్ దవాఖానల యాజమాన్యాలతో రివ్యూ చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం నెట్వర్క్ ఆసుపత్రులు 323 మాత్ర మే ఉన్నాయని, వాటి సంఖ్యను 477 అని చెప్పడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.