ఖమ్మం, ఆగసు ్ట28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చేందుకు దొడ్డిదారిన వెళ్లి, ఢిల్లీలో వందలాది మంది రైతుల ప్రాణాలు బలిగొన్నప్పుడు రైతు భరోసా ఏమైందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రశ్నించారు. ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ను ఎదుర్కోలేకనే బీఆర్ఎస్ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అమిత్‌షా వ్యాఖ్యలు గురువింద గింజను తలపిస్తున్నాయని అన్నారు. ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన బీజేపీ సభలో అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ ఏ పార్టీకీ బీ టీం కాదని అన్నారు. బీజేపీ ఖమ్మం సభ నవ్వుల పాలైందని అన్నారు. సోమవారం ఖమ్మంలోని 23వ డివిజన్లో రూ.90 లక్షలతో నిర్మించనున్న సీసీ డ్రెయిన్ పనులు, ఇల్లెందులో రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించిన బస్‌డిపోను ప్రారంభించి మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాజకీయంగా ఏం ఆశించినా ప్రయోజనం లేదని అన్నారు. కేసీఆర్‌కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వచ్చేనెల నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు అందుతాయని తెలిపారు.
అనంతరం అంగన్వాడీ టీచర్లు, ఆయాల ఉద్యోగ విరమణ వయస్సును సర్కార్ పెంచినందుకు ఖమ్మంలో అంగన్వాడీలతో కలిసి మంత్రి పువ్వాడ.. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, ఎంపీ మాలోతు కవిత, తదితరులు పాల్గొన్నారు.