ఖమ్మం : తల్లి పాలే బిడ్డకు శ్రేష్ఠమైనవని, ప్రసవం జరిగిన వెంటనే బిడ్డకు పాలు పట్టించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ సూచించారు. పుట్టిన బిడ్డ కనీసం ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా తల్లిపాలు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన మదర్ మిల్క్ బ్యాంక్, నూతన మార్చురీని ప్రారంభించడంతో పాటు రేడియాలజీ ల్యాబ్ నిర్మాణ పనులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్ధాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మదర్ మిల్క్ బ్యాంక్‌ను హైదరాబాద్, వరంగల్ తర్వాత ఖమ్మంలోనే ఏర్పాటు చేయడమైందని తెలిపారు. ప్రసవం తర్వాత అనేక మంది తల్లులకు పాలు పడడం లేదని, గర్భిణులుగా ఉన్నప్పుడు పౌష్టికాహార లోపం ఒక కారణమైతే మరికొందరిలో జీవన వ్యవహారం, మానసిక స్థితి మరో కారణమని వైద్యులు పేర్కొంటున్నారని మంత్రి తెలిపారు. దీంతో ఈ మిల్క్ బ్యాంకుల ద్వారా పాలను బాధిత బాలింతల పిల్లలకు అందించడం జరుగుతుందన్నారు.
ఆస్పత్రి ప్రాంగణంలోనే రూ.75 లక్షలతో నిర్మించనున్న రేడియాలజీ భవనాన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. దీనిలో అల్ట్రాసౌండ్, సిటీస్కాన్, ఎంఆర్ఐ, మెమోగ్రామ్, ఎక్స్‌రే విభాగాల సేవలన్నీ రోగులకు ఒకేచోట లభించనున్నాయని, తద్వారా రోగం కచ్చితంగా నిర్ధారణ అయి రోగులకు చికిత్సలు మరింత సులభతరం అవుతుందని మంత్రి అజయ్ కుమార్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, జడ్పి చైర్మన్ లింగాలకమల్ రాజ్, సుడా ఛైర్మెన్ విజయ్రు, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, డీఎం హెచ్‌వో మాలతీ, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బీ వెంకటేశ్వర్లు, ఆర్ఎంవో బొల్లికొండ శ్రీనివాసరావు, వైద్యులు, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.