ఖమ్మం, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘మతి భ్రమించే కాంగ్రెస్ ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్రావు నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నగరంలో మేం ఇసుక, మట్టి మాఫియా చేస్తున్నామని ప్రచారం చేస్తున్నారు. ఇసుక దందా చేయడానికి ఇక్కడేమైనా గోదావరి, కృష్ణా నదులు ఉన్నాయా? నగర పరిధిలో ఉన్న నది మున్నేరు. నది నిండా రాళ్లే ఉంటాయి. ఇసుక జాడే ఉండదు’ అని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆదివారం సీఎం కేసీఆర్ ప్రసంగించనున్న ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలోని చిన్న స్టేజీ తొలగింపుపై రాద్ధాంతం చేస్తున్నారని, కేవలం సీఎం భద్రతా దృష్ట్యానే స్టేజీని తొలగించాల్సి వచ్చిందని చెప్పారు. సభ పూర్తయిన తర్వాత స్టేజీని దగ్గరుండి తిరిగి నిర్మిస్తామని, ఇప్పటికే కళాశాల బ్యాంకు ఖాతాలో రూ.లక్ష జమ చేశామని స్పష్టంచేశారు.
ఖమ్మం నగరంలోని ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ కళాశాల ప్రజా ఆశీర్వాద సభ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశమే నాశనమైందని, ముందు ఆ విషయాన్ని తుమ్మల అర్థం చేసుకోవాలని హితవు పలికారు. ఖమ్మంలో మతి భ్రమించి మాట్లాడేవాళ్ల సంఖ్య ఎక్కువ అవుతుందని, వారి కోసం ప్రత్యేకంగా దవాఖాన నిర్మించాల్సిన అవసరం ఉన్నదని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి చురకలంటించారు. ఈ నెల 30న ప్రజలే ఆయనకు ఓట్లతో బుద్ధి చెప్తారని అన్నారు.
సీఎం సీభకు ప్రజలు వేలాదిగా తరలిరావాలని కోరారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు ఎన్నికల సమయంలోనే ప్రజల మధ్యకు వస్తారని అన్నారు. వాళ్లది అధికార దాహం తప్ప ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశమే ఉండదని చెప్పారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ తదితరులు పాల్గొన్నారు.