Minister Prashanth Reddy | నిజామాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సచ్చీలుడైతే.. అదానీ(Adani) పై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి (Minister Prashanth Reddy) డిమాండ్ చేశారు. బాల్కొండ నియోజకవర్గంలోని బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలకు చెందిన సుమారు 500 మంది రాష్ట్ర రోడ్డు భవనాలశాఖ మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కేటీఆర్ నాయకత్వంలో పని చేసేందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
దేశంలో మోదీ అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా కేసీఆర్ ఒక్కరే పోరాటం చేస్తున్నారని, ఆయనకు అందరూ మద్దతుగా నిలువాలని పిలుపునిచ్చారు. ఎనిమిదేళ్ల మోదీ పాలనలో ఎవరికి లాభం జరిగిందో ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. ప్రభుత్వం చేస్తున్న మంచిపనులపై బీజేపీ కోడిగుడ్డుపై ఈకలు పీకినట్లుగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు పల్లెలకు వస్తున్నాయి ? కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయో గమనించాలని సూచించారు.
రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.3.70లక్షలకోట్లు పన్నులరూపంలో కడితే ఇచ్చింది కేవలం రూ.1.70లక్షలకోట్లు మాత్రమేనన్నారు. మిగతా సొత్తంతా బీజేపీ పాలిత రాష్ట్రాలకు తరలిస్తున్నారన్నారు. మోదీ ప్రధాని అయ్యాక డాలర్‌తో రూపాయి విలువ ఎన్నడూ లేని విధంగా క్షీణించిందన్నారు. మోదీ పాలనలో నిరుద్యోగ రేటు 7శాతానికి పెరిగిందని, పెట్రోల్ ధర రూ.110, డీజిల్ ధర రూ.100 దాటిందని గుర్తు చేశారు. గ్యాస్ సిలిండర్ ధర రూ.450 నుంచి రూ.1200 వరకు పెరిగిందని, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నా ఇంధన ధరలు పెంచుతూ ప్రజలపై పెనుభారం మోపుతున్నారని ఆరోపించారు.
2జీ స్పెక్ట్రమ్ రూ.1.70లక్షల కోట్లకు అమ్ముడుపోతే ఆ విషయంలో అవినీతి జరిగిందని గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో గోల చేసిన మోదీ.. 15 ఏళ్ల తర్వాత 5జీ స్పెక్ట్రమ్ 1.48లక్షల కోట్లకే అమ్మి.. రూ.10లక్షల కోట్ల అవినీతికి పాల్పడింది నిజం కాదా? అని ప్రశ్నించారు. రుణమాఫీ, 5జీ స్పెక్ట్రమ్లాంటి రెండు కేసుల్లోనే మోదీ, అమిత్ షా దాదాపు రూ.22లక్షల కోట్ల అవినీతి చేశారని ఆరోపించారు. అక్రమంగా వచ్చినడబ్బులు వెదజల్లుతూ స్వైర విహారం చేస్తున్నారని, వినకుంటే తప్పుడు కేసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. అవినీతిని ప్రశ్నిస్తున్న కేసీఆర్ కుటుంబంపై పడ్డారని ఆరోపించారు. సుప్రీం కోర్టు వారి ఆగడాలన్నింటిని గమనిస్తుందని, అవినీతి బీజేపీ నేతలకు బేడీలు తప్పవని స్పష్టం చేశారు.