వేములవాడ, మే 12 : బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. శనివారం ప్రచార గడువు ముగిసినప్పటికీ ఆదివారం వారు వేములవాడ పట్టణంలోని అమరవీరుల స్తూపం నుంచి జాతర గ్రౌండ్‌లోని ఉడిపి హోటల్ వరకు కాంగ్రెస్, సీపీఐ నాయకులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. స్వయంగా మంత్రి పొన్న బైక్ నడుపుతూ హస్తాన్ని చూపుతూ ఉడిపి హోటల్‌కు చేరుకుని టీ తాగారు. తిరుగు ప్రయాణంలో రాజన్న ఆలయం నుంచి బస్టాండ్ వరకు ఆటోలో వచ్చారు. అక్కడి నుంచి సిరిసిల్ల వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. మహిళలతో మాట్లాడి మహాలక్ష్మి పథకం అమలుతీరును తెలుసుకున్నారు. కాగా, వేములవాడలో బైక్ ర్యాలీ తీసి హస్తం చూపుతూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన మంత్రిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.