42% రిజర్వేషన్ల అమలుపై చిత్తశుద్ధితో ఉన్నం. గతంలో క్యాబినెట్ తెచ్చిన ఆర్డినెన్స్ పెండింగ్‌లో ఉన్నది. కేసీఆర్ తెచ్చిన పంచాయతీరాజ్చట్టం ఉరితాడుగా మారింది. చట్టంలోని సెక్షన్ 285(ఏ) సవరణకు నిర్ణయించాం.
-మంత్రి పొన్నం
హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ):స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకున్నది. వచ్చే నెలలో స్థానిక పోరుకు సిద్ధం కావాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్టు తెలిసింది. శనివారం శాసనసభ, శాసనమండలి సమావేశాలు వాయిదా పడిన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాలులో రాష్ట్ర క్యాబినెట్ సమావేశమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక జీవో తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకోసం పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285(ఏ) సవరణకు నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు ఈ సమావేశాల్లోనే పంచాయతీరాజ్ చట్టసవరణ బిల్లు తెచ్చేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 30 వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గడువు విధించిన నేపథ్యంలో వచ్చే నెలలోనే ఎన్నికల నిర్వహణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాసినట్టు సమాచారం. అయితే, ప్రభుత్వం ఆదివారం తీసుకురాబోయే జీవో న్యాయ ప్రక్రియలో నిలవదని ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ స్పష్టంచేసింది. సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో క్యాబినెట్ నిర్ణయాలను మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బీసీలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించిందని మంత్రి పొన్నం వెల్లడించారు.
ఈ మేరకు బీసీ బిల్లును ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇప్పటికే సెప్టెంబర్ 30లోపు స్థానిక ఎన్నికలు ముగించాలంటూ హైకోర్టు గడువు పెట్టిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. న్యాయకోవిదులు, నిపుణులతో చర్చించాకే 42 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని స్పష్టంచేశారు. రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ ఎత్తివేసే బిల్లును ఆదివారం సభలో ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. దీనిపై సభలో చర్చించి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకుంటామని చెప్పారు.
రిజర్వేషన్లు ఏరూపంలో ఇస్తారన్న విలేకరుల ప్రశ్నలకు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పలేక తడబడ్డారు. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న మంత్రి వ్యాఖ్యలపై విలేకరులు పలు ప్రశ్నలడిగారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్(జీవో)గా ఇస్తారా? లేక చట్టం రూపంలో ఇస్తారా? అని ప్రశ్నించారు. దీనిపై మంత్రి సమాధానం చెప్పకుండా దాటవేశారు. పైగా ప్రశ్నలు అడిగిన విలేకరులపైనే మంత్రి రుసరుసలాడారు. వాస్తవానికి చట్టరూపంలో రిజర్వేషన్లు కల్పిస్తే.. వాటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అమలవుతాయని, జీవో రూపంలో ఇస్తే న్యాయపరమైన చిక్కులు ఏర్పడి రిజర్వేషన్లకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుందని విలేకరులు మంత్రిని ప్రశ్నించారు. కానీ దీనిపై స్పష్టతలేకుండా మంత్రి సమాధానం దాటవేయడం గమనార్హం.