భీమదేవరపల్లి, ఆగస్టు8: విరిగిపడిన సుంకిశాల ప్రాజెక్టు గోడపై నిజాలను త్వరలోనే నిగ్గు తేల్చుతామని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. గురువారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గురువారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన ‘విరిగిపడ్డ సుంకిశాల గోడ, తప్పిన పెను ప్రమాదం’ కథనంపై తీవ్రంగా స్పందించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచన మేరకు హైదరాబాద్ ఇన్చార్జి మంత్రిగా హైదరాబాద్కు నీళ్లు తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా హెచ్ఎండీఏ, మెట్రోవర్క్స్ అధికారులను విచారణకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. గోడ కూలిన పాపం బీఆర్ఎస్దేనని విమర్శించారు. ఒక వార్త రాసి ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తున్నదని, తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. సుంకిశాలపై దర్యాప్తు ప్రాథమిక రిపోర్టు రాగానే ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు.