హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): శాసనసభ ఆమోదించిన బీసీ రిజర్వేషన్ల బిల్లును గవర్నర్కు పంపిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. సోమవారం గవర్నర్ను కలుస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయపార్టీలు బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాయని, ఇదే విషయాన్ని గవర్నర్కు చెప్పి, ఒప్పించాలని యోచిస్తున్నామని తెలిపారు.
బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ ఎమ్మెల్యేలు కూడా గవర్నర్ వద్దకు రావాలని సూచించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టంచేశారు. సెప్టెంబర్ 30వ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలిపారు. గవర్నర్ వద్దకు రావాలని కోరుతూ పొన్నం ప్రభాకర్ శాసనసభలోని అన్నిపక్షాల కార్యాలయాలకు వెళ్లి, నేతలను ఆహ్వానించారు.