హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో త్వరలో జరగనున్న ప్రపంచ అందాల పోటీల ప్రారంభోత్సవానికి గురుకుల విద్యార్థులకు ఆహ్వానం అందిస్తామని బీసీ సంక్షేమశాఖమంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అందాల పోటీల్లో 150 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారని చెప్పారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల విద్యార్థులను శనివారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో సత్కరించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ వసతులు, అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్లో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులకు, గురుకుల సొసైటీకి పేరు తీసుకురావాలని సూచించారు. మంచి ర్యాంకులు సాధించిన 200 మంది విద్యార్థులకు అవార్డులను అందజేశారు.