యాదాద్రి భువనగిరి : రాష్ట్రంలో నెల రోజుల పాటు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు – 2026 కొనసాగుతాయని రోడ్డు రవాణా శాక మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar )తెలిపారు.
యాదగిరి గుట్టలో నేటి నుంచి ప్రారంభం కానున్న జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు – 2026 పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రతి పౌరుడు రోడ్డు భద్రత మాసోత్సవ అవగాహన సదస్సులో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ సమన్వయంతో ప్రతి విద్యార్థి దగ్గర, వారి తల్లిదండ్రుల నుండి రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తామనే హామీ పత్రం తీసుకుంటున్నామని తెలిపారు.
రాష్ట్రంలో ప్రతి పాఠశాల రోడ్ సేఫ్టీ క్లబ్లో చేరాలని సూచించారు. భవిష్యత్ అంతా రోడ్ సేఫ్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ ప్రయత్నం జరుగుతుందని వివరించారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ అధికారులు విడుదల చేసిన నివేదికల్లో అనేక మరణాలు రోడ్డు ప్రమాదాల వల్లే జరుగుతున్నాయని, అందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని రవాణా శాఖ పక్షాన తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావు , రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.