హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ కార్యాలయాన్ని తెలంగాణ అమరవీరుల జ్యోతిలో ఏర్పాటుచేస్తామని ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్సేన్‌సాగర్ ఒడ్డున అమరవీరుల జ్యోతిని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పాటుచేసి, ప్రారంభించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ఏర్పాటైన గుర్తింపు కమిటీ గురువారం సచివాలయంలో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసింది. కమిటీ చైర్మన్ కే కేశవరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు. కమిటీ ఆహ్వానం మేరకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, న్యూడెమోక్రసీ, సీపీఐ, సీపీఎం, ఆప్, టీజేఎస్ పార్టీల తరపున ఇద్దరు చొప్పున ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలు కమిటీకి తెలియజేశారు. సమావేశం అనంతరం కమిటీ సభ్యులతో కలిసి చైర్మన్ కేశవరావు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి రాజకీయ, ఉద్యమ పార్టీల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరించామని తెలిపారు. విద్యార్థి సంఘాలు, అడ్వకేట్లు, డాక్టర్లు, ఉద్యమంతో సంబంధం ఉన్న వారిని కూడా పిలిచి అభిప్రాయాలు తీసుకొంటామని, ఇందుకోసం అనేక సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. ఉద్యమకారుల ఐడెంటిటీపై వర్క్ డివైడ్ చేస్తామని, కమిటీ నివేదికకు టైమ్‌బాండ్ ఆలోచిస్తున్నామని తెలిపారు.
కేవలం రాజకీయ పార్టీలతో మాత్రమే కాకుండా ఉద్యోగ, విద్యార్థి, జర్నలిస్ట్, న్యాయవాద సంఘాలు అందిరినీ పిలిచి మాట్లాడుతామని, ఉద్యమంలో గాయాలపాలైన వారు, వివిధ రకాలుగా నష్టం జరిగిన వారికి న్యాయం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కవులు, కళాకారులు, తెలంగాణ సాధన కోసం పనిచేసిన వారినందరినీ గుర్తిస్తామని వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా సలహాలు, సూచనలు, ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లోనూ విజ్ఞప్తులను స్వీకరిస్తామని వివరించారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. ఉద్యమకారుల జేఏసీలు చాలా ఉన్నాయని, వారందరినీ కలుస్తామని తెలిపారు. అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, సబ్బండ వర్గాలతో సమావేశం ఏర్పాటుచేస్తామని, 1969 ఉద్యమకారులను కూడా గుర్తించాలని రాజకీయ పార్టీలు సూచించాయని తెలిపారు. సమావేశానికి కాంగ్రెస్ నుంచి మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, టీడీపీ, న్యూడెమోక్రసీ, ఆప్, టీజేఎస్ నుంచి ఇద్దరు హాజరయ్యారు.
తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలని కోరుతూ సీపీఐ పలు సూచనలు చేసింది. ‘తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలకు ఇండ్లు, ప్రభుత్వ ఉద్యోగం, ఆర్థిక సాయం అందేలా చూడాలి. ఉద్యమ సమయంలో విద్యార్థులు, యువకులు, ఉద్యమకారులపై నమోదైన అన్ని రకాల పోలీస్ కేసులను ఎలాంటి షరతులు లేకుండా పూర్తిగా ఎత్తివేయాలి. వయసు పైబడిన, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఉద్యమకారులకు నెలవారీ గౌరవ వేతనం అందించాలి. గన్పార్తోపాటు జిల్లా కేంద్రాల్లో అమరవీరుల జ్ఞాపకార్థం స్మారక చిహ్నాలను నిర్మించాలి. క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితుల నుంచి వినతులు స్వీకరించాలి’ అని సీపీఐ సూచించింది. సచివాలయంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో సీపీఐ తరఫున రాష్ట్ర సహాయ కార్యదర్శులు, తకలపల్లి శ్రీనివాసరావు, నరసింహ పాల్గొన్నారు.