Ponnam Prabhakar | మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య వివాదం టీపీసీసీని చేరింది. ఈ వివాదాన్ని వీలైనంత తొందరగా సద్దుమణిగేలా చేసేందుకు టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ రంగంలోకి దిగారు. ఇద్దరు మంత్రులతో మహేశ్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు ఫోన్లో మాట్లాడారు. ఆదిలాబాద్ పర్యటనలో ఉన్న మంత్రి అడ్లూరిని వెంటనే హైదరాబాద్ బయల్దేరి రావాలని కోరారు.ఇద్దరూ కలిసి పనిచేయాలని సూచించారు. ఇక ఈ వివాదంపై చర్చించేందుకు ఇవాళ సాయంత్రం పొన్నం, అడ్లూరితో మహేశ్ గౌడ్ భేటీ అవుతారని సమాచారం.
ఇక సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. తాను అడ్లూరి పేరును ఎక్కడా ప్రస్తావించలేదని తెలిపారు. సోషల్‌మీడియాలో ప్రసారమవుతున్న వీడియోను చూసి తప్పుగా అనుకుంటున్నారని పేర్కొన్నారు. ఇదే విషయమై అడ్లూరితో మాట్లాడేందుకు ప్రయత్నించానని చెప్పారు. కానీ ఆయన అందుబాటులోకి రాలేదని అన్నారు. దీనిపై మహేశ్ గౌడ్ ఫోన్ చేస్తే ఇదే విషయం చెప్పానని తెలిపారు. తమ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ తప్ప ఇంకేమీ లేదని వివరించారు.
పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందిస్తూ.. వివాదాన్ని పార్టీ నాయకత్వం, సీఎం దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ మాట్లాడతానని మాట ఇచ్చారని పేర్కొన్నారు. తనపై చేసిన వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.
జూబ్లీహిల్స్ లో మంత్రులు పెట్టిన ప్రెస్ మీట్ లో లేటుగా వచ్చినా అడ్లూరి లక్ష్మణ్ ను “దున్నపోతు” అంటున్నా పొన్నం అన్న
మనకి టైం అంటే తెలుసు ఆ..దున్నపోతు గాడికి టైం గురించి ఎం తెలుసు… pic.twitter.com/g0F8wq38vL
— Arshad (@Iamarshad46) October 5, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ఇన్చార్జి మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశానికి అందరూ వచ్చారు. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే చెందిన సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సమయానికి రాలేకపోయారు. దీంతో పొన్నం అసహనానికి లోనయ్యారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేశారు. పక్కనే ఉన్న మంత్రి వివేక్ చెవిలో గుసగుసగా ‘మనకు టైం అంటే తెలుసు.. జీవితమంటే తెలుసు.. వారికేం తెలుసు ఆ..దున్నపోతు గానికి’ అంటుండగా మైక్ స్పీకర్లు ఆన్‌చేసి ఉండటంతో అది బయటకు వినిపించింది. అప్పటికే మీడియా కెమెరాల్లో అదంతా రికార్డయింది. మళ్లీ కొద్ది నిమిషాలకే ‘వస్తుండా? స్టార్ట్ అయినంక జాయిన్ అయితాడా?’ అంటూ మైనార్టీ నేతలను ఉద్దేశిస్తూ ‘మొదలు పెట్టండి’ అని ఆర్డర్ వేసినట్టుగా పొన్నం మాట్లాడారు.
మరో మంత్రి లేకుండా ప్రెస్‌మీట్ ఎలా మొదలుపెడుతామని మెనార్టీ నేతలు సందిగ్ధంలో పడి వెనుకముందాడారు. దీంతో మరోసారి పొన్నం మైక్ అందుకొని ‘మీరు మాట్లాడుతారా? నన్ను మాట్లాడుమంటారా?’ అంటూ దబాయిస్తున్నట్టుగా మాట్లాడారు. ఇదంతా కెమెరాల్లో రికార్డయింది. మీడియా సమావేశం కవరింగ్ కోసం వచ్చిన యూట్యూబర్లు ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టగా, నిమిషాల్లోనే వైరల్ అయింది. దీంతో నాలుక కరుచుకున్న పొన్నం ప్రభాకర్ ఖండన ప్రకటన చేశారు.