TGSRTC | ఆర్టీసీ ఉద్యోగుల్లో పోటీతత్వం రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ కళాభవన్‌లో సంస్థ ఉద్యోగులకు ప్రగతి చక్రం పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి ప్రభాకర్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌తో పాల్గొన్నారు. ఇటీవల ప్రాణాలు కోల్పోయిన ఆర్టీసీ డ్రైవర్ ఎం సంపత్ కుటుంబానికి రూ.కోటి ప్రమాద బీమా చెక్కును అందజేశారు. ఆ తర్వాత ఉద్యోగులకు ప్రగతి చక్రం అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడుతూ మహాలక్ష్మి పథకంతో సంస్థకు అదృష్ట లక్ష్మి వచ్చిందన్నారు. కొత్త బస్సులు కొంటున్నామని.. త్వరలోనే నియామకాలు చేపడుతున్నట్లు తెలిపారు. రాబోయే ఐదేళ్లకాలంలో ముందస్తుగా దృష్టిలో పెట్టుకొని బస్సులు, రెండోసారి నియామకాలు చేపడుతున్నామన్నారు. 259వ రోజు 81 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని, రూ.2750 కోట్ల విలువైన ప్రయాణాన్ని తెలంగాణ అక్కాచెల్లెల్లకు అందించామన్నారు. వ్యక్తిగతంగా డ్రైవర్, కండక్టర్, అధికారిగా, మంత్రిగా ఇది సంతృప్తి ఇచ్చే అంశమన్నారు.
ఇంటర్నల్ ట్రాన్స్పరెన్సీని మరింత అభివృద్ధి చేసుకోవాలన్నారు. అత్యున్నంగా పని చేసిన వారికి అవార్డులు ఇస్తూ సన్మానం చేసుకుంటున్నామని.. మిగతా వారికి అవార్డులు పొందాలని పోటీతత్వం రావాలన్నారు. పెరుగుతున్న ట్రాఫిక్‌లో ఎలాంటి రిమార్క్ లేని డ్రైవర్లను జోనల్ వారీగా సన్మానం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం తరుఫున ఆర్థిక పరమైన అంశాలు ఉన్నపటికీ కార్మికుల సంక్షేమం కోసం క్షేత్రస్థాయి నుంచి ఆలోచిస్తున్నామన్నారు. బాండ్స్ రూ.80కోట్ల పెమెంట్స్ జరిగాయని.. రూ.200కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. దానికి నిధులు తీసుకొచి.. చెల్లించే బాధ్యత మాదన్నారు. రాఖీ పండగ రోజున 17 కోట్ల ప్రయాణాలు జరిగాయన్నారు. దాంతో రికార్డు స్థాయిలో రూ.14.90 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. రికార్డు స్థాయిలో 64 లక్షల మంది ప్రయాణం చేశారన్నారు. ఇది సిబ్బంది కృషితోనే జరిగిందన్నారు. ఆర్టీసీలో ఉద్యోగి ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే రూ.కోటి బీమా ఇచ్చేలా యూనియన్ బ్యాంక్‌తో ఎంవోయూ చేసుకున్నామన్నారు.