హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): జాతీయ రహదారులపై రద్దీగా ఉండే ప్రాంతాల్లో పాదచారుల నడక మార్గాల సంఖ్యను పెంచడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పాదచారుల భద్రతను మెరుగుపరచడంతోపాటు రద్దీగా ఉండే హైవే స్ట్రెచ్లలో ప్రమాదాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. రహదారి భద్రతకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల అమలుపై శుక్రవారం హైదరాబాద్లోని రవాణాశాఖ కార్యాలయంలో అత్యున్నత సమీక్షా సమావేశం జరిగింది.
రవాణా శాఖ కమిషనర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వంలోని అన్ని విభాగాలు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించడం, అత్యవసర సేవలను మెరుగుపర్చడం, రోడ్డు భద్రతా చట్టాలను, ట్రాఫిక్ నిబంధనలను అమలు చేయడంపై చర్చించారు. రహదారి భద్రత చర్యల్లో భాగంగా జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీలు నెలవారీగా సమావేశం కావాలని నిర్ణయించారు. రవాణా, ట్రాఫిక్, వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ, రోడ్లు-భవనాలు, ఎన్హెచ ఏఐ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు పాల్గొన్నారు.