హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ప్రతి జిల్లాలో రోడ్డు సేఫ్టీ కమిటీలు ఈ నెలాఖరులోగా సమావేశమవ్వాలని కలెక్టర్లకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కలెక్టర్ చైర్మన్‌గా, ఆర్అండ్బీ అధికారి కన్వీనర్‌గా ఉండే ఈ కమిటీ.. ఇతర విభాగాల అధికారులను సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా తీసుకోవాల్సిన కార్యాచరణపై సచివాలయంలో సీఎస్ కే రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తితో కలసి కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోడ్డు భద్రతపై గ్రామాలు, స్కూళ్లలో అవగాహన కల్పించాలన్నారు. నిరుడు తెలంగాణలో 25,934 రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. 7,949 మరణాలు సంభవించాయని తెలిపారు. ప్రమాద బాధితులకు సహాయం అందించిన వారిని ప్రోత్సహించేందుకు పథకం ప్రారంభించనున్నట్టు తెలిపారు.