హైదరాబాద్, జూలై25 (నమస్తే తెలంగాణ): 42శాతం బీసీ రిజర్వేషన్ల అమలుపై బీజేపీ కుట్రలు చేస్తున్నదని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఓబీసీ సంఘాల నేతలతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ ఢిల్లీలో శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కులగణన, రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం తెలంగాణ భవన్లో సహచర మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరితో మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్ల అమలుపై తాము దేశవ్యాప్తంగా మద్దతు కూడగడుతున్నామని, దేశవ్యాప్తంగా దీనిపై ప్రస్తుతం చర్చ కొనసాగుతున్నదని తెలిపారు. ఈ తరుణంలో 42 శాతం రిజర్వేషన్లు అమలు అసాధ్యమని బీజేపీ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించడాన్ని ఖండించారు. రిజర్వేషన్ల అమలుకు బీజేపీయే వ్యతిరేకమని, మండల్ కమిషన్‌కు వ్యతిరేకంగా ఉద్యమించిన రామచంద్రరావును ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని చేసిందని ఆరోపించారు. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తే తెలంగాణలో అడుగుకూడా పెట్టనివ్వరని తెలిపారు. బీజేపీ కపట నాటకాన్ని తెలంగాణ మేధావులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు గమనించాలని కోరారు.