హైదరాబాద్, జూన్ 2(నమస్తేతెలంగాణ): జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీలోనే దిక్కులేదంటున్నారని.. ఇక తెలంగాణలో ఏం పొడుస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. ‘తెలంగాణ మీ అయ్య జాగీరా’ అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ‘తెలంగాణ బరాబర్ మా అయ్య జాగీరే’ అంటూ వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ర్టాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలని కోరుకున్నామని, ఇలాంటి వ్యాఖ్యలతో నేతలు రెచ్చగొట్టడం సరికాదని సూచించారు. ఆయన తెలంగాణకు రావడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, నవనిర్మాణం పేరిట తెలంగాణ ఆవిర్భావం రోజే పెడుతామంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. తెలంగాణ పట్ల ఆంధ్రా నేతల తీరు మారకుంటే ఇకపై ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఒక ప్రాజెక్ట్ కూడా ఇవ్వబోమని మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. చట్టం తీసుకురావడానికైనా వెనుకాడబోమని హెచ్చరించారు.
రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యే సరికి పవన్‌కల్యాణ్‌లో డిప్రెషన్ పెరిగి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి విమర్శించారు. ఏ ప్రొడ్యూసర్ ఎక్కువ ప్యాకేజీ ఇస్తే వాళ్ల దగ్గరికే వెళ్లే పవన్, రాజకీయాల్లో కూడా ప్యాకేజీ ఎక్కువ ఇచ్చిన వాళ్లకే మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. ఆంధ్రా పార్టీలను తెలంగాణలో నమ్మే పరిస్థితి లేదని, బినామీ అడ్రస్‌తో పవన్ వస్తానంటే కుదరదని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు రాజకీయం తెలియదని, బీజేపీ స్వార్థ రాజకీయాల్లో ఆయనో పావుగా మారారని కాంగ్రెస్ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు. సీఎల్పీలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం మాట్లాడుతూ తెలంగాణ నవ నిర్మాణం పేరిట ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ డ్రామాలు ఆపాలని హితవుపలికారు. తెలంగాణలో తిరగాలంటే ముందు పవన్‌కళ్యాణ్ ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్‌కళ్యాణ్ పార్ట్ టైమ్ లీడర్ అని పేర్కొన్నారు.