హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి రవాణాశాఖలో పలు పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్టు రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో 96 మంది ఏఎంవీఐ పాసింగ్ ఔట్ పరేడ్‌కు ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడుతూ.. శిక్షణ పొందిన ఏఎంవీఐలు రోడ్డు ప్రమాదాలు నివారించి, మరణాల రేటు తగ్గించాలని సూచించారు.
ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. శిక్షణలో ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, రవాణాశాఖ కమిషనర్ సురేంద్ర మోహన్, అధికారులు పాల్గొన్నారు.