భీమదేవరపల్లి, డిసెంబర్ 23 : పీవీ ఆశయాలను కొనసాగించాలని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. పీవీ స్వగ్రామం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో సోమవారం పీవీ 20వ వర్ధంతి సభ పీవీ ప్రభాకర్‌రావు అధ్యక్షతన సోమవారం జరిగింది. ఎమ్మెల్సీ సురభివాణీదేవి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఎల్ నాగరాజు, వరంగల్ సీపీ అంబర్ కిశోర్ఝూ, వొడితెల ప్రణవ్‌బాబు పీవీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ నవోదయ పాఠశాలలను నెలకొల్పింది పీవీయే అని గుర్తు చేశారు. హనుమకొండ జిల్లాలో నవోదయ పాఠశాల లేనందున వంగరలో ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. వంగర చెరువును పర్యాటకంగా మార్చి పీవీ స్మారక పనులు పూర్తి చేస్తామని చెప్పారు. వంగరలో తాను పుట్టి పెరిగిన జ్ఞాపకాలు ఇంకా పదిలంగానే ఉన్నాయని, ఈ గడ్డపై పుట్టడం అదృష్టంగా భావిస్తున్నానని పీవీ కూతురు సురభివాణీదేవి పేర్కొన్నారు.