హైదరాబాద్, నవంబర్ 17(నమస్తేతెలంగాణ): తెలంగాణలో సోమవారం నుంచి నూతన ఈవీ పాలసీ రానుందని రాష్ట్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు జీవో 41 ద్వారా కొత్త ఈవీ(ఎలక్ట్రిక్ వెహికల్) పాలసీ తీసుకొచ్చామని, ఇది 2026 డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటుందని స్పష్టంచేశారు. జీవో ప్రకారం.. ఈవీల్లో 4వీలర్స్, టూ వీలర్స్, కమర్షియల్ వెహికల్స్కు వందశాతం పన్ను మినహాయింపు, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఉంటుందని మంత్రి తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో సగటున ప్రతి ఏడాది కొత్తగా 5 లక్షల కొత్త వాహనాలు చేరుతున్నాయని, 6 నుంచి 8 శాతం అదనపు కార్బన్ ఏర్పడుతుందని వాపోయారు.
దీంతో వాయు కాలుష్యం పెరిగినట్లు గుర్తించామని తెలిపారు. కాలుష్యాన్ని నియంత్రించడంలో భాగంగా హైదరాబాద్ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. ఢిల్లీలా హైదరాబాద్లో కాలుష్యం సమస్య తలెత్తకూడదని ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తున్నామని తెలిపారు. పెట్రోల్, డిజీల్ వాహనాల వినియోగం, వాహనాల రిపేర్లతో పోలిస్తే ఈవీ వాహనాల వల్ల వినియోగదారులకు ఏడాదికి రూ.లక్ష మిగులుతుందని చెప్పారు. ప్రజలు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోళ్లపై దృష్టి పెట్టాలని మంత్రి పొన్నం సూచించారు.