తెలంగాణచౌక్, సెప్టెంబర్ 29: త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి టీజీ ఆర్టీసీలో మూడు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam) పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో రీజియన్‌కు కేటాయించిన 35 సూపర్ లగ్జరీ ఎలక్ట్రికల్(Super luxury electric buses) బస్సులను సంస్థ వైస్ చైర్మన్, ఎండీ సజ్జనార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి సభలో మంత్రి మాట్లాడారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సంస్థను లాభాల్లోకి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదని తెలిపారు.
అందులో భాగంగా డీజీల్ భారాన్ని తగ్గించుకోవడంతోపాటు కాలుష్య రహితం కోసం 2,500 ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేయగా, వెయ్యి బస్సులు అందుబాటులోకి వచ్చాయన్నారు ప్రస్తుతం జంట నగరాల్లో 500బస్సులు నడుస్తున్నాయని, రానున్న రోజుల్లో డీజీల్ బస్సులను పూర్తిగా తొలగిస్తామన్నారు. భవిష్యత్ తరాలను కాలుష్యరహిత వాతవారణం అందించడానికి ఎలక్ట్రికల్ బస్సులను తీసుకు వస్తున్నామని తెలిపారు.
దసరాలోగా ఉద్యోగులకు బాండ్ల రూపంలో ఉన్న బకాయిలు చెల్లిస్తామన్నారు. మహా లక్ష్మి పథకం ద్వారా ఇప్పటివరకు 92కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకోగా, సంస్థకు రూ.3,200కోట్ల ఆదాయం చేకూరిందన్నారు. గ్రామ సమాఖ్య సంఘాల ద్వారా బస్సులు కొనుగోలు చేయిస్తామని తెలిపారు.
.