ఖమ్మం రూరల్/మధిర, సెప్టెంబర్ 4: ఖమ్మం జిల్లాలోని మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో బుధవారం పర్యటించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చుక్కెదురైంది. సాక్షాత్తూ సొంత నియోజకవర్గంలోనే నిరసన సెగ తగిలింది. ‘వరద తగ్గి నాలుగు రోజులయ్యాక ఇప్పుడొస్తారా?’ అంటూ నిలదీశారు. సత్వరమే తమకు సాయం అందించాలని డిమాండ్ చేశారు. మున్నేరు వరద ముంపునకు ప్రభావితమైన రామన్నపేట, దానవాయిగూడెం, తీర్థాల గ్రామాల్లో మంత్రి పొంగులేటి బుధవారం పర్యటించారు. తొలుత రామన్నపేట కాలనీకి మంత్రి కాన్వాయ్ రావడంతో స్థానికులు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.
మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వచ్చి కనీసం జీపు దిగకుండానే వెళ్లిపోయారని, కనీసం తమ బాధలు చూడలేదని విమర్శించారు. ప్రాణాలు అరచేత పట్టుకొని కట్టుబట్టలతో తాము బయట పడితే.. దర్జాగా జీపులో చేతులూపుకుంటూ వెళ్లిపోయారని దుయ్యబట్టారు. నాలుగురోజులయ్యాక మీరు వచ్చి కూడా అలాగే చేస్తున్నారని మండిపడ్డారు. మా ఇళ్లలోకి వచ్చి మా దుస్థితిని ఎందుకు చూడలేదని ప్రశ్నించారు. ఇదే క్రమంలో ఆయన వారి కాలనీలోకి ప్రవేశించబోగా కాలనీవాసులు అడ్డుకున్నారు. దీంతో కారు దిగిన మంత్రి పొంగులేటి.. వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
అధికారులతో సత్వరమే సర్వే పక్రియను పూర్తి చేయిస్తామని, సర్టిఫికెట్లు, పుస్తకాలు నష్టపోయిన వారికి న్యాయం చేస్తామని అన్నారు. తడిసిన బియ్యం స్థానంలో సన్నబియ్యం అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ స్తంభాలు, తీగల మరమ్మతులకు చర్యలు చేపడతామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మంత్రి మాటలను విశ్వసించని బాధితులు.. తమకు న్యాయం జరిగే వరకు కారును కదలనివ్వబోమని భీష్మించారు. పరిస్థితిని గమనించిన పొంగులేటి.. కాలనీలో పర్యటించకుండానే వెనుదిరిగారు. అనంతరం ఆయన కాన్వాయ్ తీర్థాల వైపు వెళ్లిపోయింది.
వరదలతో నిరాశ్రయులమైన తమకు కనీసం సహాయక చర్యలు చేపట్టకపోవడంపై ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్‌నగర్, ముస్లిం కాలనీకి చెందిన బాధితులు అధికారులను బుధవారం అడ్డుకున్నారు. కాలనీకి మున్సిపల్ కమిషనర్‌తోపాటు తహసీల్దార్ రాంబాబు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ వీపీ గౌతమ్ వస్తున్నారని తెలుసుకున్న వరద బాధితులు వారిని నిలదీశారు. ‘మీరు మా కాలనీకి రావొద్దు.. గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు.
నాలుగు రోజులుగా పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. దీంతో అధికారులు చేసేది లేక వెనుదిరిగి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లిపోయారు. దీంతో అక్కడికి చేరుకున్న బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. బీఆర్ఎస్ నాయకుడు మొండితోక జయాకర్, సీపీఐ నాయకుడు బెజవాడ రవిబాబు వరద బాధితులను శాంతింపజేశారు. అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో బాధితులు ఆందోళన విరమించారు.