హైదరాబాద్, జనవరి 9(నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల పథకం మొదటి విడతలో స్థలం ఉన్నవారికే మంజూరు చేయనున్నట్టు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు. రెండో దశలో జాగ లేనివారికి జాగ ఇచ్చి ఇల్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. మొదటి విడతలో దివ్యాంగులు, ఒంటరి మహిళలు, అ నాథలు, వితంతువులు, ట్రాన్స్జెండర్లు, సఫాయి కర్మచారీలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ఫిర్యాదుల స్వీకరణకు రూపొందించిన ప్రత్యేక వెబ్‌సైట్‌ను మంత్రి గురువారం సచివాలయంలో ప్రారంభించారు. ఇందిరమ్మ పథకానికి సంబంధించిన ఫిర్యాదులు ఏమైనా ఉంటే indirammaindlu.telangana. gov.inకు ఫిర్యాదు చేయవచ్చని మంత్రి పేర్కొన్నారు. ఫిర్యాదులు గ్రామాలకు సంబంధించినవైతే ఎంపీడీవోకు, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్‌కు వెళ్తాయని తెలిపారు.అర్హులైన వారికే ఇండ్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
నల్లగొండ, మహబూబ్‌నగర్, కామారెడ్డి జిల్లాల్లో 98 శాతం వరకు ఇండ్ల పరిశీలన పూర్తయినట్టు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి అధికారులు వివరించారు. ములుగు, కరీంనగర్, సంగారెడ్డి, సిరిసిల్ల, మెదక్ జిల్లాల్లో 97 శాతం, మహబూబాబాద్, జగిత్యాల, సిద్దిపేట, ఆసిఫాబాద్, జనగాం, రంగారెడ్డి, నిజామాబాద్, యాదాద్రి, పెద్దపల్లి జిల్లాలలో 96 శాతం పరిశీలన పూర్తయినట్టు అధికారులు వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 88 శాతమే పూర్తయినట్టు చెప్పారు. త్వరలో లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేసి ఇండ్ల నిర్మాణానికి కార్యాచరణపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు. సమావేశంలో హౌసింగ్ స్పెషల్ సెక్రటరీ జ్యోతి బుద్ధప్రకాశ్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ పాల్గొన్నారు.
హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన రెవెన్యూ బిల్లు ‘భూ భారతి’ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించినట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గవర్నరర్ ఆమోదించిన బిల్లు కాపీని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌మిట్టల్ గురువారం సచివాలయంలో మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వీలైనంత త్వరలో చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా విధివిధానాల రూపకల్పనపై ప్రత్యే క దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిషారం చూపేలా భూ భారతి చట్టాన్ని రూపొందించినట్టు చెప్పా రు. కొత్త చట్టం ప్రకారం గ్రామాల్లో రెవెన్యూ పాలనను చూసేందుకు ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించనున్నట్టు తెలిపారు.