హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ) : ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు. వరదలు, అగ్నిప్రమాదాల వంటి అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందన, శాఖల మధ్య సమన్వయం, ముందస్తు సన్నద్ధత ఎంతో కీలకమని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన విపత్తు నిర్వహణ మాక్ ఎక్సర్‌సైజ్‌లలో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్ హెచ్ఎండీఏ గ్రౌండ్స్ వద్ద నిర్వహించిన భారీ వరద మాక్ డ్రిల్‌ను సంబంధిత అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విపత్తులు సంభవించినప్పుడు మొదటి గంట అత్యంత కీలకమని, ఆ గోల్డెన్ అవర్‌లో తీసుకునే చర్యలే ప్రాణాలను కాపాడగలవని చెప్పారు.
అగ్నిప్రమాదాలు, వరదలు, ఆకస్మిక ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వేగంగా సహాయక చర్యలు చేపట్టడం, అత్యవసర సేవలను సమన్వయం చేయడం కోసం ఇలాంటి మాక్‌డ్రిల్‌లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. మాక్‌డ్రిల్‌లో భాగంగా లైఫ్బోట్లు, సాంకేతిక పద్ధతులు, అత్యవసర తరలింపు చర్యలు, రెస్యూ ఆపరేషన్లను ప్రత్యేక బృందాలు ప్రదర్శించాయి. అనంతరం మంత్రి నెక్లెస్‌రోడ్ బోటింగ్ క్లబ్‌ను సందర్శించి రెస్యూ కార్యకలాపాలను పరిశీలించారు. కార్యక్రమంలో విపత్తు నిర్వహణశాఖ కార్యదర్శి దాసరి హరిచందన, రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపకశాఖ డీజీ విక్రమ్‌సింగ్‌మాన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఎన్డీఎంఏ లీడ్ కన్సల్టెంట్ మేజర్ జనరల్(రిటైర్డ్) సుధీర్బెల్తోపాటు పోలీస్, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రెవెన్యూ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’(ఐకేజేబీపీ) అనే సార్వత్రిక జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్నది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ పథకానికి సంబంధించిన విధివిధానాల ఖరారుకు మంగళవారం క్యాబినెట్ సబ్ కమిటీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేయనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార అధ్యక్షతన జరిగే సమావేశంలో సభ్యులుగా ఉన్న మంత్రులు ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొననున్నారు.