Indiramma House | హైదరాబాద్, ఏప్రిల్ 22(నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం పిడుగులాంటి వార్త చెప్పింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం ఉంటేనే బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇందిరమ్మ ఇండ్ల ను 400 చదరపు అడుగులకు తగ్గకుండా, 600 చదరపు అడుగులు మించకుండా నిర్మాణం జరిగితే బిల్లులు విడుదల చేయాలని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. నిర్మాణ దశలో ఉన్న లబ్ధిదారులకు ప్రతి సోమవారం బిల్లులను వారి ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో భూభారతి, ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఇందిరమ్మ ఇండ్లు 600 చ.అడుగులలకు మించకుండా ఉంటేనే డబ్బులు విడుదల చేయాలని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. 200 దరఖాస్తులకు ఒక గెజిటెడ్ అధికారిని నియమించి, అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు అందేలా చూడాలని చెప్పారు. అనర్హులను ఎంపిక చేస్తే ఆ గెజిటెడ్ అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీతో ముగియనున్న ఎల్ఆర్ఎస్ గడువును మరోసారి పెంచే ఆలోచన లేదని స్పష్టం చేశారు.