హైదరాబాద్, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ) : తనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూటిగా సమాధానం చెప్పలేక, ఆధారాలు బయటపెట్టిన బీఆర్ఎస్, ‘నమస్తే తెలంగాణ’పైనే నిందలు మోపడం చర్చనీయాంశమైంది. ఓ వైపు మేఘా కంపెనీతో అంటకాగుతూ పనులు చేయడం, మరోవైపు రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే సదరు కంపెనీకే పెండింగ్ లేకుండా నిధులు చెల్లిస్తూ ఇతర కాంట్రాక్టులు కూడా అప్పగించడం మరచి.. తిరిగి బీఆర్ఎస్కే కంపెనీతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ ఎదురుదాడికి దిగడం ఉల్టాచోర్ కొత్వాల్‌కో డాంటే అన్నట్టున్నది. ఇటీవల కొత్వాల్‌గూడ క్రషర్, నాదర్గుల్ భూములు, వట్టినాగులపల్లి భూముల విషయంలో మంత్రి పొంగులేటి కుమారుడు హర్షారెడ్డి పేరు తెరపైకి వచ్చిన నేపథ్యంలో పొంగులేటి తాజాగా స్పందిస్తూ ప్రెస్‌మీట్ ఏర్పాటుచేశారు.
ప్రధానంగా బీఆర్ఎస్పైనే నిందలు మోపే యత్నం చేశారు. కంపెనీలతో బీఆర్ఎస్నే కమీషన్లు కుదుర్చుకున్నదని, తనకేమీ సంబంధం లేదంటూ బుకాయించారు. జాగీర్లోకి మేఘా ఎంట్రీ అంటూ ఐటం రాసి, ఆ తర్వాత పొంగులేటి కబ్జా చేశారంటూ వార్తలు రాశారని, దాంట్లో ఆంతర్యమేమిటి? అంటూ ఎదురు ప్రశ్నించారు. మేఘా కంపెనీకి, బీఆర్ఎస్ ఏం చేసిందో తెలియనిది కాదంటూ ఆరోపణలకు దిగారు. ఆ కంపెనీతో ఒప్పందాలు చేసుకున్నారని, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత తాము ఇవ్వబోమని చెప్పామని, అందుకే వార్తాలు రాశారంటూ చిలుకపలుకులు పలికారు. మేఘా అధినేతను బీఆర్ఎస్ నేతలు రహస్యంగా కలుసుకొని, సెటిల్మెంట్లు చేసుకున్న తర్వాత ఈ ప్రభుత్వం మీద, మంత్రి మీద నిందలు మోపుతున్నారని పొంగులేటి సుద్దులు చెప్పారు.
ఇదిలా ఉంటే వాస్తవంగా మేఘా కంపెనీతో అంటకాగుతున్నది కాంగ్రెస్ సర్కారే. తిరిగి బీఆర్ఎస్పైనే ఆరోపణలు దిగడం మంత్రి తీరుకు అద్దం పడుతున్నది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్‌తో పాటు నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లోని లక్ష ఎకరాలకు సాగునీటి, తాగునీటి అవసరాల కోసం కొడంగల్-నారాయణపేట(ఎన్‌కేఎల్‌ఐఎస్) లిఫ్ట్‌ను చేపట్టిన విషయం తెలిసిందే. రూ.1134.62 కోట్లతో ప్యాకేజీ-1, 1126.23కోట్లతో ప్యాకేజీ-2 పనులకు అంచనాలు వేశారు. పంపింగ్ సిస్టమ్ కోసమే రూ.2,260.85కోట్లు అవసరమవుతాయని అంచనా వేయగా, ఆ రెండు ప్యాకేజీల పనుల టెండర్లను దక్కించుకున్నది మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబీలకు చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీయే, సదరు మంత్రి బీఆర్ఎస్తో సంబంధం అంటగట్టిన మేఘా కంపెనీలే కావడం గమనార్హం.
అదీకూడా ఆయా పనుల అంచనా వ్యయం కంటే 3.95శాతం ఎక్కువగా కోట్ చేయడం కొసమెరుపు. అదీకూడా సదరు కంపెనీలు ముందే కూడబలుక్కొని పనులు దక్కించుకున్నట్టు స్పష్టంగా తెలిసిపోతున్నది. ప్యాకేజీ-1 పనులను రాఘవ కన్స్ట్రక్షన్స్ అంచనా వ్యయం కంటే 3.95 శాతం ఎక్కువ కోట్ చేస్తే, అవే పనులకు మేఘా కంపెనీ 4.85శాతం అధికంగా కోట్ చేసింది. మొత్తంగా ఎల్1గా నిలిచిన రాఘవ కంపెనీకి ప్యాకేజీ-1 టెండర్ దక్కింది. ఇక ప్యాకేజీ-2 పనులకు మేఘా ఇంజినీరింగ్ 3.95 శాతం అధికంగా కోట్ చేయగా, రాఘవ కంపెనీ 4.8శాతం అధికంగా కోట్ చేసింది. వెరసి ఎల్1గా నిలిచిన మేఘా కంపెనీకి ప్యాకేజీ-2 టెండర్ దకింది.
అయితే మేఘా కంపెనీ అధికంగా కోట్ చేసిన చోట రాఘవ కంపెనీ తక్కువగా కొటేషన్ దాఖలు చేయడం, మేఘా కంపెనీ తక్కువ కొటేషన్ దాఖలు చేసిన చోట రాఘవ కంపెనీ అధికంగా కొటేషన్ దాఖలు చేయడం గమనార్హం. కంపెనీలతో ఎవరు ఏ ఒప్పందాలు చేసుకున్నారనేది ఈ టెండర్లతోనే బట్టబయలు అవుతున్నది. ఇరు కంపెనీలు లోపాయికారీగా ముందస్తుగానే ఒప్పందం చేసుకొని, అందుకు అనుగుణంగా కొటేషన్లు దాఖలు చేసినట్లు స్పష్టంగా అర్థమవుతున్నది. కానీ మంత్రి మాత్రం తిరిగి బీఆర్ఎస్తోనే మేఘాకు సంబంధాలు అంటగట్టడం ఆయనకే చెల్లింది.
ఇరిగేషన్‌శాఖలో విడుదలవుతున్న బిల్లులన్నీ మేఘా, రాఘవ కంపెనీలకే వెళ్లడం గమనార్హం. కాంగ్రెస్ ప్రభుత్వం 28 నెలల్లో ఈ శాఖకు మొత్తం రూ.13వేల కోట్లను విడుదల చేయగా, అందులో 12 ప్రాధాన్యత ప్రాజెక్టులకే రూ.3,377 కోట్లను భూసేకరణ, పనుల కోసం చెల్లించింది. ఇతర ప్రాజెక్టులకు సంబంధించి రూ.9,500కోట్లను చెల్లించగా, అవన్నీ బడా కాంట్రాక్టర్లకు, సంబంధించినవేనని గణాంకాలు తెలుపుతున్నాయి. అందులో ప్రధానంగా రెండు ఏజెన్సీలకే దాదాపు రూ.3,820కోట్లను చెల్లించినట్టు ఇరిగేషన్‌వర్గాలు వెల్లడిస్తున్నాయి. దేవాదుల, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్, కాళేశ్వరం, సీతారామ, డిండి ప్రాజెక్టుల పనులను నిర్వహిస్తున్న రెండు ఏజెన్సీలకే నిధులన్నీ పోతున్నట్టు వివరిస్తున్నాయి. మేఘాకు దాదాపు ఇప్పటివరకు రూ.2,900కోట్లు, రాఘవ ఏజెన్సీకి రూ.920కోట్లని గణాంకాలే స్పష్టంగా తేటతెల్లం చేస్తున్నాయి.
మరి కంపెనీతో కాంగ్రెస్‌తో ఏ సంబంధమే లేకుంటే బిల్లులన్నీ వాటికే ఎందుకు విడుదల చేస్తున్నదో మంత్రే చెప్పాలి. అంతేకాదు సుంకిశాల ఘటనలో మేఘాపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మొదటినుంచీ డిమాండ్ చేస్తున్నది. కానీ మంత్రి ప్రవచిస్తున్న ప్రజాప్రభుత్వం ఇప్పటికీ సదరు కంపెనీపై చర్యలు తీసుకోలేదు, నివేదికలు బయటపెట్టడం లేదు. అదీగాక ఇరిగేషన్‌లోనే కాదు సదరు కంపెనీకే ఇతరత్రా అనేక కాంట్రాక్టులను కాంగ్రెస్సే కట్టబెడుతున్నది. కానీ మంత్రి పొంగులేటి మాత్రం మేఘాకు, బీఆర్ఎస్కు సంబంధాలు అంటగడుతూ తన అక్రమాలకు కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేయడం గమనార్హం.