RRR Alignment | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రీజినల్ రింగ్‌రోడ్డు (ట్రిపుల్ ఆర్) దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ను ఖరారు చేసేందుకు ప్రభుత్వం 12 మంది అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ కమిటీలో రోడ్లు, భవనాలు, పురపాలక, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శులతోపాటు ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం పరిధిలోని జిల్లాల కలెక్టర్లు (యాదాద్రి-భువనగిరి, నల్లగొండ, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి)తో పాటు రోడ్లు, భవనాలు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు.. ఇలా 12 మంది సభ్యులు ఈ కమిటీలో ఉంటారని చెప్పారు. ఇంతకుముందే గత ప్రభుత్వ హయాంలో భారత జాతీయ రహదారుల అధీకృత సంస్థ (ఎన్హెచ్ఏఐ) రూపొందించిన ట్రిపుల్-ఆర్ దక్షిణభాగం అలైన్‌మెంట్‌ను మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిర్ణయించిందన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారుకు 12 మంది అధికారులతో కమిటీని వేశామని తెలిపిన మంత్రి పొంగులేటి.. అసలు అలైన్‌మెంట్‌ను మార్చాల్సిన అవసరమేమిటో మా త్రం వివరించలేదు. సాధారణంగా సాంకేతిక సమస్యలున్న చోట మార్పులు చేయ డం సహజం. అందుకు ప్రత్యేకంగా ఓ కమిటీ అవసరం లేదు. ఇందుకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఖరారైన ఉత్తర భాగం అలైన్మెంట్ నిదర్శనం. కానీ ప్రభుత్వం దక్షిణ భాగం అలైన్మెంట్లో భారీ ఎత్తున మార్పులు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది.
ఆ విషయాన్ని సూటిగా చెప్పకుండా అధికారుల భుజం మీద పెట్టి తమ అలైన్‌మెంట్‌ను ఖరారు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే నిజమైతే.. ఈ భారీ మార్పులకు ఎన్హెచ్ఏఐ అంగీకరిస్తుందా? అన్నది కీలకంగా మారింది. ఒకవేళ అంగీకరించకపోతూ కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.12,500 కోట్లను కోల్పోవాల్సి వస్తుందనేది సుస్పష్టం. ఈ విషయం తెలిసినా ప్రభుత్వం కమిటీ వేసిందంటే ప్రపంచ బ్యాంకు రుణం వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తున్నది.
చాలాకాలంగా దక్షిణ భాగం అలైన్మెంట్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆ మేరకు క్షేత్రస్థాయిలో లీ అసోసియేట్స్ సర్వేలు చేపట్టి.. సంబంధిత గ్రామాల్లో గుర్తులు కూడా పెట్టింది. రాత్రివేళల్లో డ్రోన్లతో సాంకేతిక సర్వేలు కూడా చేశారు. వాటన్నింటినీ క్రోడీకరించిన అధికారులు కొన్నిరోజుల కిందట పాత, కొత్త అలైన్మెంట్లతో పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా రూపొందించారు. దానినే ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో ప్రదర్శించగా.. ఈ మార్పులపై ఏ ఒక్క అధికారి నోరు విప్పొద్దనే హుకుం జారీ అయినట్టు తెలిసింది. దీంతో అసలు ఆ ప్రజంటేషన్లో ఉన్న మార్పులు సూచించినదెవరు? ప్రభుత్వ పెద్దల ఆదేశం లేనిదే అధికారులు అలైన్‌మెంట్‌ను మార్చే సాహసం చేస్తారా? ముఖ్యంగా సీఎం ముందు మార్పులతో కూడిన అలైన్‌మెంట్‌ను ప్రదర్శించిన తర్వాత కొత్తగా చేసే మార్పులు ఏమిటి? అందుకు అధికారులతో కూడిన కమిటీ ఎందుకు? ఈ ప్రశ్నలకు ప్రభు త్వం సమాధానం చెప్పాల్సిన అవసరముందని పలువురు డిమాండ్ చేస్తున్నా రు.
మరోవైపు ప్రభుత్వం అధికారులతో కమిటీ వేయడంతో ఇప్పటివరకు ఆందోళనలో ఉన్న గ్రామాల రైతుల్లో తీవ్ర చర్చ మొదలైంది. కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి అలైన్మెంట్ మార్పులను సూచిస్తుందా? అనేది కీలకమైన విషయం. ఈ క్రమంలో ఆయా గ్రామాల్లోని రైతుల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకుంటారా? గ్రామసభలు నిర్వహిస్తారా? అనేది వేచిచూడాల్సి ఉంది. గతంలో రూపొందించిన అలైన్‌మెంట్‌పై రైతుల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాలేదు. అంటే ఇప్పుడు వాటిలో మార్పు జరిగితే రైతుల నుంచి భిన్నమైన స్పందన వస్తుందనేది సుస్పష్టం. అందుకే ఈ మార్పుల్లో రైతుల భాగస్వామ్యం ఉంటుందా? అనేది తేలాల్సి ఉంది.
ప్రభుత్వ, కాంగ్రెస్ పెద్దల భూముల కోసం ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్లో మార్పునకు కుట్ర జరుగుతున్నదంటూ మూడు రోజులుగా ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలు ప్రచురిస్తున్నది. రైతుల గోడును బయటి ప్రపంచానికి చేరవేస్తున్నది. కానీ ప్రభుత్వ పెద్దలు దేవుడెరుగు.. సంబంధిత శాఖ అధికారులైనా నోరెత్తితే ఒట్టు! వారిని సంప్రదించేందుకు ప్రయత్నించినా… ‘మాకేం తెల్వదు మహాప్రభో!’ అంటూ చేతులెత్తేస్తున్న పరిస్థితి. చిన్న వార్తలకే ఖండనలు పంపే సర్కారు యంత్రాంగం ట్రిపుల్ ఆర్ కథనాలపై ఎందుకు స్పందించడంలేదు? ప్రస్తుతం అధికార యంత్రాంగంలోనే కాదు.. ప్రజల్లోనూ ఇదే చర్చ జరుగుతున్నది.