హైదరాబాద్, జూలై10 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు పంచాయతీరాజ్ చట్టం-2018 సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని, ఆ తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించింది. కొత్తగా రెండు ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు, గోశాల నిర్వహణకు ముగ్గురు అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసేందుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గం సచివాలయంలో గురువారం సమావేశమైంది. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వాకిటి శ్రీహరి క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బీసీ డెడికేటేడ్ కమిషన్‌ను నియమించిందని గుర్తుచేశారు.
రాష్ట్ర ప్రణాళిక విభాగం అధ్వర్యంలో కులగణన చేపట్టి, ఆ నివేదికల ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే బిల్లులను అసెంబ్లీలో ప్రభుత్వం ఆమోదించిందని పేర్కొన్నారు. 42 శాతం రిజర్వేషన్ల అమలుకు తదుపరి చర్యలు చేపట్టాలని ప్రస్తుతం క్యాబినెట్ తీర్మానించిందని పొంగులేటి వెల్లడించారు. ఇటీవలే పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశంపై హైకోర్టు కూడా నెలాఖరులోపు రిజర్వేషన్స్ ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిందని, వాటన్నింటిపై మంత్రివర్గం చర్చించిందని వివరించారు.
ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు అనుగుణంగా రాష్ట్రంలో అమల్లో ఉన్న పంచాయతీరాజ్ చట్టం-2018 సవరణలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, త్వరలోనే ఈ చట్టంలో చేయాల్సిన సవరణలకు అవసరమైన చర్యలు చేపట్టాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని వివరించారు. అలాగే త్వరలో 22,033 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడంపైనా క్యాబినెట్ చర్చించింది. ఇప్పటివరకు జరిగిన 18 క్యాబినెట్ సమావేశాల్లో 327 అంశాలపై తీసుకున్న నిర్ణయాల పురోగతిని శాఖలవారీగా మంత్రివర్గం చర్చించిందని, వాటిలో 321 అంశాలను క్యాబినెట్ ఆమోదించిందని వెల్లడించారు. 25న క్యాబినెట్ మళ్లీ సమావేశమవుతుందని తెలిపారు.
కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడంపై బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తంచేశారు. కోర్టు తీర్పులో భాగంగా నెల రోజుల్లో రిజర్వేషన్లు పూర్తిచేసి ఎన్నికల జరపాలని ప్రభుత్వంలో 19వ క్యాబినెట్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. పార్టీలకతీతంగా బీసీల 42 శాతం రిజర్వేషన్లకు మద్దతివ్వాలని కోరారు. రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సహచర మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి వాకిటి శ్రీహరి, పొన్నం మిఠాయిలు తినిపించుకున్నారు.