కూసుమంచి(నేలకొండపల్లి), మార్చి 5 : ఎంతో చరిత్ర కలిగిన బౌద్ధ స్థూపం(Buddhist stupam) ప్రాధాన్యతను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(
Minister Ponguleti) అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి(Nelakondapalli) మండలంలో మంగళవారం పర్యటించిన ఆయన ముజ్జుగూడెం సమీపంలోని బౌద్ధ స్థూపాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బౌద్ధుల పరిపాలన, వారి చారిత్రక ఘట్టానికి ఆనవాళ్లుగా మిగిలిన ఈ స్థూపం కాలక్రమంలో మరుగునపడిందన్నారు. బౌద్ధులకు నిలయంగా పాలన సాగిన కాలంలో నేల కొండపల్లికి ఎంతో గొప్ప చరిత్ర ఉందని, ఆ చరిత్రను భావితరాలు గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో 8 ఎకరాల స్థలంలో చుట్టూరా అభివృద్ధి చేసేందుకు తగిన కార్యచరణ రూపొందించాలన్నారు.
స్థూపం చుట్టూ, పరిసరాలను శుభ్రం చేయాలని, బస్టాండ్లు, రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాల్లో స్థూపానికి సంబంధించి వివరాలు తెలుపుతూ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రూ.కోటి వ్యయంతో నిర్మిస్తున్న విడిది కేంద్రాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇప్పటివరకు బౌద్ధ స్థూపం వద్ద చేపట్టిన పనులు, వాటి వివరాలను కలెక్టర్ గౌతమ్‌ను అడిగి తెలుసుకున్నారు.