ఖమ్మం : పార్టీలకు అతీతంగా పనిచేస్తానని, అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు(Welfare schemes) అందజేస్తానని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti )అన్నారు. ‘మీ చెంతకే మీ మంత్రి పొంగులేటి’ అనే నినాదంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా(Khammam) ఖమ్మం రూరల్ మండలంలో ఆదివారం ఆయన విస్తృతంగా పర్యటించారు. తొలుత రెడ్డిపల్లిలోని మారెమ్మతల్లి దేవాలయంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రెడ్డిపల్లి గ్రామస్తులతో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హోల్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
గ్రామంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల గురించి గ్రామపెద్దలు, ముఖ్య నాయకులను అడిగి తెలుసుకున్నారు. తరువాత పద్మశ్రీ వనజీవి రామయ్యతో కాసేపు ముచ్చటించారు. అనంతరం పోలేపల్లి, పల్లెగూడెం, గోళ్లపాడు, తీర్థాల, పొలిశెట్టిగూడెం, మంగలిగూడెం, తనగంపాడు, గూడూరుపాడు, ఎం. వెంకటయపాలెం, కాచిరాజుగూడెం, ఆరెకోడుతండా, ఆరెకోడు, చింతపల్లి, ఆరెంపుల గ్రామాల్లో పర్యటించి గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. పాలేరు నియోజకవర్గ ప్రజలను జన్మజన్మలా గుర్తుపెట్టుకుంటానని, వారి రుణం తప్పకుండా తీర్చుకుంటానని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం అనేక దరఖాస్తులు వస్తున్నాయని అన్నారు.