ఖమ్మం రూరల్, నవంబర్ 28 : లాక్కున్న గిరిజనుల భూములను తిరిగి అప్పగించకపోతే లగచర్ల తరహాలో ఉద్యమిస్తామని ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్‌నాయక్ హెచ్చరించారు. ఖమ్మం జిల్లా నాయుడుపేట సర్కిల్లోని సర్వే నంబర్136కి సంబంధించిన అసైన్డ్ భూమిని శుక్రవారం ఆయన సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు కిషన్‌నాయక్ తదితర గిరిజన సంఘాల నాయకులతో కలిసి ర్యాలీగా తరలివచ్చి పరిశీలించారు. కొద్ది రోజుల క్రితం రెవెన్యూ అధికారులు కూల్చివేసిన ఫెన్సింగ్‌ను బాధిత రైతులు బానోత్ కృష్ణ, బానోత్ రామ్మూర్తి చూపించారు.
అనంతరం రాజేశ్‌నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. గిరిజనుల భూములను రెవెన్యూ అధికారులు లాక్కోవాలని చూడటం సరికాదని అన్నారు. పాలేరులో గిరిజనుల ఓట్లతో గెలిచిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దీనిపై ఆరా తీసి, ఆ భూమిని తిరిగి గిరిజనులకు అప్పగించేలా చూడాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆయన క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడించడంతోపాటు పంచాయతీ ఎన్నికల్లో గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని, సస్పెన్షన్ వేటు వేసిన ఉద్యోగిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.