హైదరాబాద్ : తెలంగాణ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని చాటేలా రాష్ట్రంలో దేవాలయాల(Temples) అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Poguleti )అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా మాటల్లో కాకుండ చేతల్లో చూపిస్తామన్నారు. వరంగల్లోని కాళోజీ కళాక్షేత్రం పనుల పురోగతి, భద్రకాళి దేవస్థానం అభివృద్ధి పనులపై మంగళవారం సచివాలయంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, అధికారులతో సమీక్షించారు.
చారిత్రాత్మక భద్రకాళి దేవస్థానం అభివృద్ధి పనులను ఆగమశాస్త్ర ప్రకారం నిర్మాణాలను చేపట్టాలని, ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 30 కోట్ల రూపాయలతో దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఇందులో 20 కోట్ల రూపాయలను SDF కింద, 10 కోట్ల రూపాయలను కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) సమకూరుస్తుందని పేర్కొన్నారు. కాళోజీ నారాయణరావు కళాక్షేత్ర పనులను రెండు నెలల్లో పూర్తి చేయాలని, అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరక్ దాన కిశోర్, దేవాదాయ శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్, హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయిక్ పాల్గొన్నారు.