Minister Komatireddy | నల్లగొండ, ఆగస్టు 3: నల్లగొండ పట్టణంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని కూల్చేయండని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరోమారు అక్కసును వెళ్లగక్కారు. గతంలో ఒకసారి అధికారులను ఇలాగే ఆదేశించగా.. శనివారం నల్లగొండలో కౌన్సిల్ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా మరోమారు బీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు. మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్‌ను పిలిచి బీఆర్ఎస్ ఆఫీసు కూల్చివేత ఎంతవరకు వచ్చిందని ఆరా తీశారు. ఆయన మౌనంగా ఉండటంతో ‘నవ్వు కూల్చేస్తావా.. లేదా? బీఆరెసోళ్లు చెప్పినట్టు చేస్తున్నావా!’ అంటూ మండిపడ్డారు. ‘నేను అమెరికా వెళ్తున్నా.
ఈ నెల 11న తిరిగి వస్తా. ఆలోపు ఆ ఆఫీస్ నేలమట్టం చేయాలి’ అని ఆదేశించారు. పక్కనే ఉన్న అదనపు కలెక్టర్ పూర్ణచందర్‌ను పిలిచి.. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్‌కు ఆదివారం నోటీసులు జారీ చేసి.. సోమవారం ఆఫీసు రేకులు ఎక్కడ పెట్టాలో అడగాలని సూచించారు. ఇది మంత్రి ఆర్డర్ అంటూ హుకుం జారీ చేశారు. బీఆర్ఎస్ ఆఫీస్ స్థ్దానంలో వాటర్‌ట్యాంక్, స్త్రీనిధి భవ నం నిర్మాణానికి ప్లాన్ తయారు చేయాలని మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
మున్సిపల్ కమిషనర్ స్పందించడం లేదని గ్రహించిన మంత్రి.. వెంటనే మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డిని పిలిచి ఆదివారం బీఆర్ఎస్ అధ్యక్షుడికి కమిషనర్ ద్వారా నోటీస్ పంపే బాధ్యత తీసుకుని, ఆ వెంటనే నిర్మాణం కూల్చేయాలని సూచించారు. కమిషనర్ స్పందించకపోతే ఆయనపై కేసు పెట్టి జైలుకు పంపండని అసహనం వ్యక్తంచేశారు. ఒక దశలో చైర్మన్ కూడా పెద్దగా రెస్పాండ్ కాకపోవడంతో ‘నేనేం చేప్తున్నాను.. నువ్వేం వింటున్నావ్’ అంటూ మంత్రి ఒకింత విసుక్కున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ): రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం ఉప్పల్-ఘట్కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించనున్నారు. ఈ ఫ్లైఓవర్ పనులు 2018లో ప్రారంభమైనా, ఇప్పటికీ సగం కూడా పూర్తికాలేదు. పనుల జాప్యంపై ఎన్హెచ్ఏఐ అధికారులు పలు దఫాలు నిర్మాణ సంస్థకు నోటీసులు జారీచేసినా స్పందన లేదు. ఫ్లైఓవర్ పనుల జాప్యం కారణంగా ఈ రోడ్డుపై నిత్యం ప్రమాదాలు జరుగుతూ, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ విషయాన్ని ఇటీవల కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ దృష్టికి తీసుకుపోగా, నిర్మాణ సంస్థ కాంట్రాక్టును రద్దుచేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించేందుకు మంత్రి వెంకటరెడ్డి ఆదివారం వెళ్తున్నారు. మిగిలిపోయిన పనులను పాత ధరల ప్రకారం చేపట్టేందుకు నిర్మాణ సంస్థలు ముందుకు రావని, అందుకే కొత్తగా టెండర్లు పిలవడం అనివార్యమని అధికారులు తెలిపారు. నిర్మాణ ధరలు పెరిగిన నేపథ్యంలో పాత కాంట్రాక్టును రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలవాల్సి ఉంటుందని వివరించారు.
నల్లగొండ రూరల్, ఆగస్టు 3 : ‘వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఆరోగ్యం కూడా సహకరించకపోవచ్చు. రాజకీయాల్లో ఉన్నా, లేకున్నా ప్రజలకు సేవ చేస్తూనే ఉంటా’నని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా గుండ్లపల్లిలో డీ-37 కెనాల్‌కు శనివారం నీటిని విడుదల చేశారు.
అనంతరం గ్రామానికి చెందిన రాజేంద్రప్రసాద్ వ్యవసాయ క్షేత్రంలో కాసేపు విరామం తీసుకొని భోజనం చేశారు. ఆ తరువాత ముఖ్య అనుచరులు, సన్నిహితులతో కాసేపు ముచ్చటిస్తూ పైవిధంగా చెప్పుకొచ్చారు. శ్రీశైలం సొరంగం, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తి చేయడం తన చిరకాల ఆకాంక్ష అని పేర్కొన్నట్టు తెలిసింది.